ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఉప్పాడ తీర ప్రాంతంలోని మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇందుకోసం ఆయన 100 రోజుల ప్రణాళికను ప్రకటించారు. ఈ ప్రణాళికలో భాగంగా ఉప్పాడ, కాకినాడ తీర ప్రాంత మత్స్యకారులకు అధ్యయనం, అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే, అధునాతన పద్ధతులపై అధ్యయనం చేసేందుకు ఉప్పాడ మత్స్యకారుల బృందాన్ని తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు పంపించి శిక్షణ ఇప్పించారు.
డిసెంబర్ 8న 60 మంది మత్స్యకారులు రెండు బృందాలుగా విడిపోయి, ఆ రెండు రాష్ట్రాలకు వెళ్లి మూడు రోజుల పాటు ట్రైనింగ్ తీసుకున్నారు. తమిళనాడుకు వెళ్లిన బృందానికి చెన్నైలోని మండపం వద్ద కేజ్ కల్చర్, రిఫ్ కల్చర్, మరియు ఆధునిక మార్కెటింగ్ వ్యవస్థల ఏర్పాటుపై శిక్షణ అందించారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో మత్స్య సంపదను పెంచి, స్థిరమైన ఆర్థికాభివృద్ధి సాధించడం ఎలా అనే అంశంపై వారికి అవగాహన కల్పించారు.
అలాగే, కేరళకు వెళ్లిన బృందానికి మోడల్ ఫిషింగ్ హార్బర్‌ల సందర్శన, హ్యాచరీల్లో చేపల గుడ్లు పొదిగించడం, అత్యాధునిక వలల తయారీ వంటి అంశాలపై ట్రైనింగ్ ఇచ్చారు. ఈ విధంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాలు అనుసరిస్తున్న టెక్నాలజీని ఉపయోగించి ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారులకు వసతులు కల్పించేందుకు అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఈ కొత్త స్ట్రాటజీ ఉప్పాడ మత్స్యకారుల రాత మారుస్తుందని ఆశాభావం వ్యక్తం అవుతోంది.