‘వందే మాతరం’ 150వ వార్షికోత్సవం సందర్భంగా లోక్‌సభలో జరిగిన చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశ జాతీయ గీతాలలో ఒకటైన ‘వందే మాతరం’పై చరిత్రలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావిస్తూ, మొహమ్మద్ అలీ జిన్నా ఈ గీతానికి వ్యతిరేకించారని, ఆ భావనలతోనే అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఏకాభిప్రాయానికి వచ్చారని ఆరోపించారు. ఈ పాటలోని కొన్ని అంశాలు కొందరు ముస్లింలను కలవరపెట్టవచ్చని భావించి కాంగ్రెస్ పార్టీ దీనిని పూర్తిగా స్వీకరించలేదని ఆయన పేర్కొన్నారు.
‘వందే మాతరం’ విషయంలో కాంగ్రెస్ తీసుకున్న చారిత్రక నిర్ణయాలను ప్రధాని మోదీ ప్రస్తావించారు. 1937లో కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశాల్లో ఈ గీతంలోని మొదటి రెండు చరణాలు మాత్రమే పాడాలని నిర్ణయించింది. మిగతా చరణాల్లో హిందూ దేవతల ప్రస్తావన ఉండటం కొందరికి అభ్యంతరకరంగా మారిందని కాంగ్రెస్ అప్పట్లో వివరణ ఇచ్చింది. అయితే, ఈ నిర్ణయం దేశ విభజనకు విత్తనాలు వేసిందని, ‘వందే మాతరం’లోని కొన్ని భాగాలను తొలగించడం జాతీయ ఐక్యతకు భంగం కలిగించిందని ప్రధాని మోదీ విమర్శించారు.
ఈ చర్చలో ప్రధాని మోదీ ఎమర్జెన్సీ విషయాన్ని కూడా ప్రస్తావించారు. ‘వందే మాతరం’ 100వ వార్షికోత్సవం జరుపుకున్న సమయంలో దేశం ఎమర్జెన్సీలో చిక్కుకుందని, రాజ్యాంగం నలిగిపోయిందని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, దాని గౌరవాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, నెహ్రూ గతంలో రాసిన లేఖలు కూడా రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. ఆ లేఖల్లో ‘వందే మాతరం’లోని పదాలను దేవతలుగా భావించడం అప్రాసంగికమని నెహ్రూ అభిప్రాయపడ్డారని, అయితే ఆ పాట మొత్తం హానిలేనిదేనని ఆయన స్పష్టం చేశారని బీజేపీ నేతలు చెబుతున్నారు.