ఖమ్మం జిల్లా సత్తుపల్లి అర్బన్ పార్కులో జరిగిన జింకల వేట కేసు మిస్టరీని జిల్లా అటవీ శాఖ అధికారులు ఛేదించారు. ఈ అమానుష ఘటనకు పాల్పడినట్లు గుర్తించిన మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ప్రధాన నిందితుల్లో అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సోదరుడి కుమారుడు మెచ్చా రఘు ఉండటం తీవ్ర సంచలనం సృష్టించింది. గత నెల 24వ తేదీ సాయంత్రం ఈ ఘటన జరిగిందని, నిందితులు నాటు తుపాకులతో వచ్చి ఐదు జింకలను వేటాడి చంపినట్లుగా జిల్లా అటవీ శాఖ అధికారి (DFO) సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ తెలిపారు.
ఈ వేటలో అటవీ శాఖ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి గోపీకృష్ణ సహకరించినట్లు దర్యాప్తులో తేలింది. నిందితులు గోపీకృష్ణ సహాయంతో అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మార్చి, అధికారులను ఏమార్చేందుకు ప్రయత్నించారు. అయితే, ఇతర సీసీ ఫుటేజీల ఆధారంగా మెచ్చా రఘు, కుంజా భరత్‌తో పాటు గోపీకృష్ణ, శ్రీరామ్ ప్రసాద్ అనే వ్యక్తులు ఈ నేరంలో పాల్గొన్నట్లు అధికారులు గుర్తించారు. వేటకు సహకరించిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి గోపీకృష్ణను ఇప్పటికే సస్పెండ్ చేశారు.
ఈ కేసు ఛేదనలో ఖమ్మం సీపీ, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీల సహకారం తీసుకున్నట్లు డీఎఫ్‌వో పేర్కొన్నారు. వన్యప్రాణి చట్టం ప్రకారం వేట చట్టరీత్యా నేరమని, ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎఫ్‌వో సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ హెచ్చరించారు. ఈ కేసు ఛేదనలో పాల్గొన్న అటవీ శాఖ సిబ్బందిని ఆయన అభినందించారు. వన్యప్రాణుల వేటపై అధికారులు ఈ స్థాయిలో కఠినంగా వ్యవహరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.