తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన ‘ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు’ కార్యక్రమంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేశారు. ఈ సందర్భంగా ఆయన స్వయం సహాయక మహిళా సంఘాలకు రూ. 11.33 కోట్ల విలువైన బ్యాంకు లింకేజీ చెక్కులను స్వయంగా పంపిణీ చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణను దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టి, ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దే సరికొత్త అభివృద్ధి మాడల్‌ను త్వరలో ప్రకటిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి ఈ నెలలో జరగబోయే ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ గురించి వివరిస్తూ, ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు వంద దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు. ఈ సమ్మిట్‌లో భవిష్యత్తులో తెలంగాణను అభివృద్ధి పథాన నడిపించే వ్యూహాలను ప్రకటించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, పేదలకు అందిస్తున్న సన్నబియ్యం పంపిణీలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, గిరిజన ప్రాంతాలకు అదనంగా 25 వేల ఇళ్లను మంజూరు చేశామని వివరించారు.
దేవరకొండ నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి అనేక హామీలను, నిధులను ప్రకటించారు. నర్సింగ్ కాలేజీని మంజూరు చేస్తామని, పదేళ్ల పాటు పడావు పడిన ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని భరోసా ఇచ్చారు. దేవరకొండ మున్సిపాలిటీలో రూ. 13 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం, రూ. 50 కోట్లతో సీసీ డ్రైన్లు, రూ. 2.5 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. మాజీ ఎంపీ ఎస్. జైపాల్ రెడ్డి చదువుకున్న పాఠశాల అభివృద్ధికి రూ. 6 కోట్ల నిధులు మంజూరు చేశారు.