మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా విమర్శించారు. జగన్ చేస్తున్న నీచ ఆరోపణల గురించి, గతంలో రైతులకు మోసం చేసింది ఎవరో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసని మంత్రి అన్నారు. కేవలం 18 నెలల్లో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, గత జగన్ ఐదేళ్ల పాలన అబద్ధాలను బట్టబయలు చేసిందని ఆయన స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వకపోవడంపై మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేని జగన్‌కు మాట్లాడే అర్హతే లేదని అన్నారు. గత ప్రభుత్వం చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టిన రూ. 1,674 కోట్ల ధాన్యం బకాయిలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లించిందని ఆయన గుర్తు చేశారు. అంతేకాక, రైతు ఆత్మహత్యల కుటుంబాలకు గతంలో చెల్లించని పరిహారాలను కూడా తమ కూటమి ప్రభుత్వం వెంటనే అందజేసిందని, మద్దతు ధరల కోసం 16 నెలల్లో రూ. 800 కోట్లు ఖర్చు చేశామని మంత్రి తెలిపారు.
రైతులను, ప్రజలను ఎప్పటికప్పుడు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్న జగన్ మరోసారి అబద్ధాలతో ప్రచారం చేయడం దారుణమని అచ్చెన్నాయుడు తీవ్రంగా స్పందించారు. గత ఐదేళ్ల పాటు జగన్ నడిపిన తుగ్లక్ పరిపాలనే వ్యవసాయ రంగాన్ని దెబ్బతీయడానికి ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు. వాస్తవాలపై బహిరంగ చర్చకు జగన్‌తో తాను సిద్ధమని మంత్రి అచ్చెన్నాయుడు సవాలు విసిరారు.