ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. “కోనసీమ కొబ్బరికి తెలంగాణ ప్రజల దిష్టి తగిలింది” అని పవన్ కల్యాణ్ మాట్లాడటం బాధాకరమని, ఇలాంటి మాటలు అన్నదమ్ముల్లా ఉంటున్న రెండు రాష్ట్రాల ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడమే అవుతుందని ఆమె విమర్శించారు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని అభిప్రాయపడిన షర్మిల, ఉపముఖ్యమంత్రిగా ఈ విధంగా మాట్లాడటం సబబు కాదని పేర్కొన్నారు. వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. కోనసీమలో కొబ్బరి తోటలు ఎండిపోవడానికి గట్లు, డ్రెడ్జింగ్ పనులపై పట్టింపు లేకపోవడం వల్లే సముద్రం నుంచి పైకొస్తున్న ఉప్పు నీళ్లే కారణమని ఆమె ఆరోపించారు.
ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో విఫలమై, ఆ వైఫల్యాన్ని మూఢ నమ్మకాలైన దిష్టి మీదకు తోసేయడం సరికాదని షర్మిల ప్రశ్నించారు. కోనసీమ కొబ్బరి రైతుల కష్టాలకు తక్షణ పరిష్కారం చూపాలని, ఉప్పునీటి ముప్పును తప్పించడానికి వెంటనే రూ. 3,500 కోట్లు కేటాయించి పనులు మొదలు పెట్టాలని ఆమె కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.