హిందూ దేవుళ్లను అవమానించేలా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ హిందువులను, హిందూ దేవుళ్లను అవమానించడమే ధ్యేయంగా పెట్టుకున్నట్లు ఉందని ఆయన విమర్శించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను గాయపరిచేలా ఉన్నాయని, అందువల్ల ఆయన హిందూ సమాజానికి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో కేసీఆర్ ‘హిందుగాళ్లు, బొందుగాళ్లు’ అంటే ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో గుర్తుంచుకోవాలని ఆయన హితవు పలికారు.
అనంతరం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ (HILT) పాలసీపై కూడా కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో రైతులకు ఒక న్యాయం, పారిశ్రామికవేత్తలకు మరొక న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను కాదని పారిశ్రామికవేత్తలకే ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే అనేక మౌలిక సమస్యలు ఉన్నాయని, అలాంటి పరిస్థితుల్లో హిల్ట్ పేరుతో నగరంలో 9 వేల ఎకరాల్లో మల్టీపర్పస్ కమర్షియల్ కాంప్లెక్స్‌లు నిర్మిస్తే జరగబోయే పరిణామాలను ముఖ్యమంత్రి అంచనా వేశారా అని నిలదీశారు.
హైదరాబాద్‌ను మరో బెంగళూరుగా మార్చాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు. బెంగళూరులో ట్రాఫిక్ సమస్య కారణంగా పెట్టుబడులు వెనక్కి వెళ్లాయని గుర్తుచేస్తూ, ఇప్పుడు హైదరాబాద్‌ను కూడా అదే స్థితికి తీసుకురావాలనుకుంటున్నారా అని నిలదీశారు. ఈ రాష్ట్రంలో గతంలో కేసీఆర్ ‘ఏకైక మేధావిని’ అని నిర్ణయాలు తీసుకున్నారని, ఇప్పుడు మరొక మేధావి రేవంత్ రెడ్డి వచ్చారని ఆయన విమర్శించారు.