విశాఖపట్నంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, పర్యాటక రంగానికి కొత్త ఆకర్షణగా నిర్మించిన గ్లాస్ బ్రిడ్జ్ కైలాసగిరిపై ప్రారంభమైంది. సుమారు రూ. 7 కోట్ల నిధులతో నిర్మించిన ఈ బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ భరత్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, మేయర్ పీలా శ్రీనివాసరావు, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్ట్ విశాఖ పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేస్తుందని అధికారులు తెలిపారు.
ఈ గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న 40 ఎంఎం మందం కలిగిన ల్యామినేటెడ్ గాజును వినియోగించారు. భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన ఈ బ్రిడ్జి ఒకేసారి 500 టన్నుల బరువు మోయగల సామర్థ్యం కలిగి ఉంది. అంతేకాకుండా, 250 కి.మీ. వేగంతో గాలులు వీచినా తట్టుకోగలదు. గ్లాస్ బ్రిడ్జ్ పైకి ఒకేసారి 40 మందిని మాత్రమే అనుమతిస్తారు.
ఈ సందర్భంగా వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ.. విశాఖను పర్యాటక రాజధానిగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. పర్యాటకానికి పెద్దపీట వేస్తున్నామని, ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా తట్టుకుని నిలబడేలా గ్లాస్ బ్రిడ్జిని నిర్మించామని చెప్పారు. అంతేకాకుండా, కైలాసగిరిపై త్వరలోనే త్రిశూల్ ప్రాజెక్టును కూడా అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన వెల్లడించారు.