డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్ (డీఏసీఏ) ప్రోగ్రామ్‌పై ఫెడరల్ న్యాయమూర్తి కీలక తీర్పు ఇచ్చారు. డీఏసీఏ కార్యక్రమాన్ని చట్టవిరుద్ధ ప్రోగ్రామ్‌గా పేర్కొంటూ.. కొత్తగా వచ్చే అప్లికేషన్‌లను ఆమోదించవద్దంటూ ప్రభుత్వాన్ని ఆదేశించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఎలాంటి పత్రాలు లేకుండా చిన్నతనంలోనే తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వచ్చి నివసిస్తున్న వారికి రక్షణ కల్పిస్తూ బరాక్ ఒబామా సర్కార్ 2012లో డీఏసీఏ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది. అయితే ఒబామా తర్వాత అధికారంలోకి వచ్చిన ట్రంప్.. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ డీఏసీఏ కార్యక్రమాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు కూడా జారీ చేశారు.
కానీ గత ఏడాది ఆయనుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. డీఏసీఏ ప్రోగ్రామ్‌ను యథాస్థితికి తీసుకురావాలని ఆదేశిస్తూ ఫెడరల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా.. ఈ ప్రోగ్రామ్‌ను వ్యతిరేకిస్తున్న అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు.. మళ్లీ కోర్టును ఆశ్రయించాయి. ఈ క్రమంలో దీనిపై విచారణ జరిపిన టెక్సాస్ ఫెడరల్ జడ్జి ఆండ్ర్యూ హానెన్.. డీఏసీఏ ప్రోగ్రామ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఏసీఏ చట్టవిరుద్ధ కార్యక్రమం అన్నారు. డీఏసీఏ కింద కొత్తగా వచ్చే దరఖాస్తులను ఆమోదించవద్దని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తీర్పు చెప్పారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారిపై ఈ తీర్పు ఎటువంటి ప్రభావం చూపదని స్పష్టం చేశారు.