తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పౌరుల నిరంతర విద్యుత్ అవసరాలు తీర్చేందుకు ఏకంగా 3000 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు సిద్ధమైంది. రాబోయే ఐదేళ్ల కాలానికి టెండర్ల ప్రక్రియ ద్వారా ఈ భారీ మొత్తంలో సోలార్ పవర్ సేకరించనున్నారు. ఈ నిర్ణయం పునరుత్పాదక ఇంధన వినియోగంలో తెలంగాణ ఒక ముందంజ వేయబోతున్నదని తెలియజేస్తుంది. దీనివలన రాష్ట్రంలోని ప్రజలకు పర్యావరణ హితమైన.. నాణ్యమైన విద్యుత్ సరఫరా అయ్యే అవకాశం ఉంది.
కొత్తగా కొనుగోలు చేయబోయే 3000 మెగావాట్ల సోలార్ పవర్ గ్రిడ్ స్థిరత్వానికి తోడ్పడుతుంది. అలాగే బొగ్గు ఆధారిత విద్యుత్ పై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఈ ఐదేళ్ల కాంట్రాక్టు ద్వారా ప్రభుత్వం సోలార్ పవర్ ఉత్పత్తి సంస్థలతో దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోనుంది. ఈ ప్రక్రియలో పారదర్శకత నిర్వహణకు ప్రభుత్వం కృషి చేస్తుంది. సరసమైన ధరలకు అధిక నాణ్యత గల సోలార్ పవర్ సేకరించటం ఈ టెండర్ల ముఖ్య ఉద్దేశం.
మరో ముఖ్య పరిణామంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం భారీ ప్రాజెక్టుకు పరిపాలన అనుమతులు జారీ చేసింది. విద్యుత్ లైన్లను అండర్‌గ్రౌండ్ కేబుల్స్‌గా మార్చే ప్రాజెక్ట్ కోసం రూ. 4,051 కోట్లు కేటాయించింది. ముఖ్యంగా నగర ప్రాంతాలలో తరచుగా సంభవించే విద్యుత్ అంతరాయాలకు ఈ ప్రాజెక్ట్ ఒక పరిష్కారం చూపనుంది. వానాకాలంలో గాలివానల సమయంలో చెట్లు పడిపోవటం ద్వారా లేదా ఇతర ప్రమాదాల కారణంగా విద్యుత్ సరఫరాకు ఆటంకం కలుగుతుంది. విద్యుత్ లైన్లను భూగర్భంలోకి తరలించటం వలన ఈ సమస్యలను నివారించవచ్చు.
ఈ కీలక ప్రాజెక్ట్ మొదటి దశ పనులు ఇప్పటికే గుర్తించిన ప్రధాన ప్రాంతాలలో ప్రారంభం కానున్నాయి. వాటిలో బంజారా హిల్స్, సికింద్రాబాద్, హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ సౌత్ సర్కిల్స్ ఉన్నాయి. ఈ నాలుగు సర్కిల్స్ లోని ఓవర్‌హెడ్ కేబుల్స్‌ను భూగర్భ కేబుల్స్‌గా మార్చటం వలన విద్యుత్ పంపిణీ మరింత సురక్షితం అవుతుంది.
ఈ రెండు నిర్ణయాలు వల్ల తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ భవిష్యత్తుపై దృష్టి పెట్టిందని స్పష్టం చేస్తున్నాయి. ఈ చర్యలు రాష్ట్రంలో విద్యుత్ స్థిరత్వం, పంపిణీ నాణ్యత పెంచటంతో పాటు, పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడనున్నాయి.