నేతలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంతర్గత రిపోర్ట్..!

జనసేన పార్టీలో కూడికలు.. తీసివేతలు మొదలయ్యాయా? ఆ పార్టీలో కొందరు నేతలు కీలకం కాబోతున్నారా? పార్టీని బలోపేతం చేసేందుకు కొత్త నేతలు రాబోతున్నారా? స్థానిక ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యతను వారికి అప్పగించస్తున్నారా? మా పార్టీలో తప్పు చేసినా క్షమించనని పవన్ కల్యాణ్ ఎందుకన్నారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

 

పవన్‌కల్యాణ్ వార్నింగ్ వెనుక

 

బుధవారం రాజోలు వెళ్లారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. పల్లె పండుగలో భాగంగా ప్రజలకు చెప్పాల్సిన నాలుగు మంచి మాటలు చెప్పారు. అదే సమయంలో పార్టీ నేతలు, కార్యకర్తలను కాస్త గట్టిగా హెచ్చరించారు. గతంలో జిల్లాల వారీగా సమావేశాలు పెట్టి సున్నితంగా నేతలను మందలించేవారు.

 

ఇప్పుడు ఓపెన్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చేశారు జనసేనాని. మా పార్టీలో ఎవరు తప్పు చేసినా క్షమించనని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించని వారిని మా పార్టీలో ఉన్నా బయటకు పంపిస్తానని సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు. ఉన్నట్లుండి పవన్ మాటల వెనుక ఏం జరిగింది? జరుగుతోందంటూ ఆరా తీయడం మొదలైంది.

 

పార్టీ వ్యవహారాలు ఇకపై ఆయనే

 

ఇటీవల కొందరు పార్టీ నేతలు తమ తమ నియోజకవర్గాల్లో చేతివాటం ప్రదర్శించినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీని కారణంగా నియోజకవర్గాల్లో కూటమి నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్టు వార్తలు లేకపోలేదు. దీనిపై ప్రత్యేకంగా కమిటీ వేసి విచారణ చేపట్టారు. ఆ తర్వాత రాజధాని నుంచి ఓ టీమ్‌ని పంపించి మరీ సమాచారం తీసుకున్నారట అధినేత.

 

ఈ నేపథ్యంలో అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు ఆ పార్టీలోని కొందరు నేతలు. ఒకప్పుడు జనసేనలో కీలకంగా వ్యవహరించిన నేతలు ప్రస్తుతం మంత్రి పదవులు రావడంతో బిజీ అయిపోయారు. ఈ క్రమంలో పార్టీ వ్యవహారాలు గాడి తప్పుతున్నాయన్న వాదన సైతం లేకపోలేదు.

 

అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గాల నేతలతో సమావేశాలు తగ్గడం ఓ కారణంగా చెబుతున్నారు. నాయకులు, కార్యకర్తలకు దూరం అవుతున్నారనే ఫీలింగ్ లేకపోలేదు. పార్టీ కోసం కష్టపడిన వారికి విషయంలో అన్యాయం జరుగుతుందన్న విమర్శలు లేకపోలేదు. ఈ నేపథ్యలో కొత్త వ్యక్తికి బాధ్యతలు అప్పటించారట పవన్ కల్యాణ్.

 

రామ్ తాళ్లూరికి పార్టీ కీలక బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నారు. ఇకపై జనసేన వ్యవహారాలను చూడబోతున్నారట. ఖమ్మం జిల్లాకు చెందిన ఆయన నిర్మాతే కాదు వ్యాపారవేత్త కూడా. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నా, ఎప్పుడూ పదవుల్లో లేరని అంటున్నారు.

 

ఇప్పుడు ఆయన్ని తెరపైకి తెచ్చారని అంటున్నారు. మంగళగిరి ఆఫీసు నుంచి ఏపీ-తెలంగాణల్లో పార్టీ వ్యవహారాలను చక్కబెడుతున్నారు. ప్రస్తుతం ఉన్న కమిటీలను రద్దు చేసి కొత్తవాటిని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. మొత్తానికి పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే జనసేనాది ముందుగానే అలర్ట్ అయినట్టు కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *