ఏపీలో అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయి. కేవలం రాజధాని భవనాల పనులు మాత్రమే కాదు.. పలు కేంద్ర సంస్థల పనులు జోరందుకున్నాయి. తాజాగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ అమరావతి చేరుకున్నారు. ఆమెకు సీఎం చంద్రబాబు కుటుంబసభ్యులు ఘన స్వాగతం పలికారు.
అమరావతిలో ఆర్థికమంత్రి సీతారామన్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ పర్యటనకు వచ్చారు. గురువారం ఆమె అమరావతికి చేరుకున్నారు. ఆమెను ముఖ్యమంత్రి చంద్రబాబు డిన్నర్‌కు ఆహ్వానించారు. గురువారం రాత్రి ఉండవల్లిలోని సీఎం నివాసానికి వచ్చిన కేంద్రమంత్రి సీతారామన్‌కు సిఎం చంద్రబాబు దంపతులు, మంత్రి లోకేష్ దంపతులు స్వాగతం పలికారు.
శుక్రవారం అమరావతిలో పలు బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు ఆమె శంకుస్థాపన చేయనున్నారు. ఏపీ రాజధాని అమరావతి సరికొత్త కళ సంతరించుకుంటుంది. ఇకపై జాతీయ, పలు ఆర్థిక సమస్థలకు అమరావతి చిరునామాగా మారనుంది. శుక్రవారం నాడు ఒకేసారి 15 బ్యాంకులు, ఆర్థిక సంస్థల ఆఫీసుల నిర్మాణాలను శంకుస్థాపన చేయనున్నారు కేంద్రమంత్రి నిర్మల సీతారామన్.
గతరాత్రి సీఎం చంద్రబాబు ఇంట్లో డిన్నర్
శుక్రవారం ఉదయం 11.22 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ఆయా కార్యాలయాల కోసం ఇప్పటికే భూమిని కూడా కేటాయించింది చంద్రబాబు సర్కార్. అమరావతిలో మొత్తం 27.855 ఎకరాల భూములను కేటాయించింది. బ్యాంకులు ఆఫీసుల భవనాలకు దాదాపుగా 9.6 ఎకరాలు ఇచ్చారు.
వాటిలో ఎస్‌బీఐ, కెనరా బ్యాంకు, నాబార్డు, యూనియన్ బ్యాంకు సహా డజను బ్యాంకులున్నాయి. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-ఆర్‌బీఐ, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్-ఎల్‌ఐసీ, ఆదాయపు పన్నుశాఖ వంటి కీలకమైన సంస్థల కోసం దాదాపు 5.8 ఎకరాలు కేటాయించింది ఏపీ ప్రభుత్వం.
దీనికితోడు సిబ్బంది వసతికి 7.02 ఎకరాలు, అనుబంధ సంస్థల ఉద్యోగుల నివాసాలకు మరో 4.54 ఎకరాలు కేటాయించింది. ఆయా జాతీయ సంస్థల ద్వారా రూ.1,328 కోట్ల పెట్టుబడులు అమరావతికి వచ్చాయి. అంతేకాదు దాదాపు 6 వేల ఉద్యోగాలు రానున్నాయి. బ్యాంకు ఆఫీసులు ఉద్దండరాయునిపాలెం, వెలగపూడి, రాయపూడి, లింగాయపాలెం వంటి ప్రాంతాల్లో రానున్నాయి.
ఇదిలా ఉండగా గురువారం అమరావతి రైతులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. గతంలో కేంద్రం ఇచ్చిన క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ గడువు పూర్తి అయ్యింది. దాన్ని పెంచాలని కోరారు. ఈ విషయాన్ని శుక్రవారం భేటీలో ఆర్థికమంత్రి సీతారామన్ దృష్టికి తేనున్నారు సీఎం చంద్రబాబు. దీనికితోడు పోలవరం-నల్లమలసాగర్ అనుసంధానానికి ఆర్థిక సహకారం చేయాలని కోరనున్నారు. దీనికితోడు పోలవరం ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ పూర్తి, పునరావాస కార్యక్రమాలకు అడ్వాన్సుగా నిధులు మంజూరు చేయాలని కోరే అవకాశం ఉంది.