తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ, మొదటి మూడు రోజుల దర్శన టోకెన్లను ఆన్‌లైన్ ఎలక్ట్రానిక్ డిప్ (లక్కీ డిప్) ద్వారా కేటాయించాలని నిర్ణయించింది. భక్తులు ఇంట్లో కూర్చొనే ఈ డిప్‌లో పాల్గొని వైకుంఠ ద్వార దర్శన టిక్కెట్లు పొందేందుకు ప్రయత్నించవచ్చు.
మొదటి మూడు రోజులకు (డిసెంబర్ 30, 31, జనవరి 1) దర్శనం టోకెన్ల కోసం భక్తులు నవంబర్ 27 ఉదయం 10 గంటల నుండి డిసెంబర్ 1 సాయంత్రం 5 గంటల వరకు టీటీడీ వెబ్‌సైట్, మొబైల్ యాప్ లేదా వాట్సాప్ బాట్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులందరికీ (1+3 విధానంలో) టోకెన్లు అందుబాటులో ఉంటాయి. డిసెంబర్ 2వ తేదిన మధ్యాహ్నం 2 గంటలకు ఎలక్ట్రానిక్ డిప్ ఫలితాలు భక్తులకు తెలియజేయబడతాయి. ఈ మూడు రోజులు SED, శ్రీవాణి, ఇతర ప్రత్యేక దర్శనాలు రద్దు చేయబడ్డాయి.
వైకుంఠ ద్వార దర్శనాల్లో చివరి ఏడు రోజులు (జనవరి 2 నుండి జనవరి 8వ తేదీ వరకు) మాత్రం భక్తులకు టోకెన్లు లేకుండానే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -2 ద్వారా సర్వ దర్శనం కల్పిస్తారు. ఈ రోజుల్లో భక్తులు నేరుగా క్యూలైన్లలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. అయితే, చివరి ఏడు రోజులకు రోజుకు 1000 శ్రీవాణి దర్శనం టిక్కెట్లు, 15 వేల రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను డిసెంబర్ 5వ తేదీన ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.