రిజర్వేషన్లు 50 శాతం పరిమితికి మించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిజమైన సామాజిక న్యాయం సాధ్యం కావాలంటే, బలహీన వర్గాలకు మేలు జరగాలంటే రాజ్యాంగ సవరణ ఒక్కటే మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ సవరణ జరిగినప్పుడే 50 శాతం పరిమితిని దాటేందుకు వీలు కలుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాల్సిందిగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు యనమల విజ్ఞప్తి చేశారు. సమాజంలో అసమానతలను రూపుమాపడంలో ప్రభుత్వాల పాత్ర అత్యంత కీలకమని ఆయన గుర్తుచేశారు. ముఖ్యంగా విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారానే ఇది సాధ్యపడుతుందని ఆయన సూచించారు.
ఈ రెండు రంగాలను బలోపేతం చేయడం ద్వారా మానవ వనరులు అభివృద్ధి చెందుతాయని, తద్వారా ప్రజల మధ్య ఆర్థిక, విద్య, ఆరోగ్యపరమైన అంతరాలు తగ్గుముఖం పడతాయని యనమల వివరించారు. బలహీన వర్గాల అభ్యున్నతి దిశగా ప్రభుత్వాలు ఈ అంశాలపై దృష్టి సారించాలని ఆయన కోరారు.