స్థానిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపపై దృష్టి సారించి, పార్టీ బలోపేతం కోసం కీలక మార్పులు చేపట్టారు. ఇందులో భాగంగా, కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం నుంచే మార్పునకు శ్రీకారం చుట్టారు. గత ఎన్నికల్లో ఓడిన మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని ఇన్‌చార్జి స్థానం నుంచి తప్పించి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించారు. ఈ నిర్ణయం ద్వారా, దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తున్న ఆది నారాయణరెడ్డిని ఎదుర్కోవడానికి వైసీపీ ఒక బలమైన అస్త్రాన్ని సిద్ధం చేసుకుందని భావిస్తున్నారు.
2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున సుధీర్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయిన రామసుబ్బారెడ్డి, ఆ తర్వాత వైసీపీలో చేరి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. సుధీర్ రెడ్డి గెస్ట్ రోల్ ప్లే చేస్తూ కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడంతో, లోకల్ లీడర్లు పక్క చూపులు చూసే పరిస్థితి ఏర్పడింది. ఈ క్యాడర్ కన్ఫ్యూజన్‌కు తెరదించుతూ, ఆది నారాయణరెడ్డి దూకుడును సమర్థవంతంగా ఎదుర్కోవడానికి రామ సుబ్బారెడ్డి బలమైన నేతగా సరిపోతారని వైసీపీ అధిష్టానం భావించింది. దీంతో జమ్మలమడుగు పాలిటిక్స్‌లో రామసుబ్బారెడ్డి మరింత యాక్టీవ్ రోల్ పోషిస్తున్నారు.
మరోవైపు, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాత్రం తన స్థానంలో రామసుబ్బారెడ్డిని నియమించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయన సేవలను పార్టీ రాష్ట్ర కమిటీ కోసం వాడుకుంటామని, 2029లో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చినా సుధీర్ రెడ్డి అంగీకరించలేదని తెలుస్తోంది. దీంతో సుధీర్ రెడ్డి దారెటు? అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం, సీనియర్ లీడర్లైన రామసుబ్బారెడ్డి వర్సెస్ ఆది నారాయణరెడ్డి మధ్య మరోమారు పోరును షురూ చేసింది.