వైసీపీ ఎన్నారై నేత మాలపాటి భాస్కర్ రెడ్డికి పోలీస్ కస్టడీ: అసభ్య పోస్టులపై విచారణ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో పాటు టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన మహిళలపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, ఎన్నారై మాలపాటి భాస్కర్ రెడ్డిని రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. లండన్‌లో నివాసముంటున్న భాస్కర్ రెడ్డి, గత మూడేళ్లుగా సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద పోస్టులు పెడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరంకు చెందిన భాస్కర్ రెడ్డి, ఇటీవల తన తండ్రి మరణించడంతో స్వగ్రామానికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే ఆయనను ఈ నెల 21 వరకు రిమాండ్‌కు తరలించగా, ప్రస్తుతం నెల్లూరు జిల్లా జైలులో ఖైదీగా ఉన్నారు.

రిమాండ్ గడువు ముగియడంతో పోలీసులు ఆయనను తిరిగి కోర్టులో ప్రవేశపెట్టి, కేసులో మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని ఐదు రోజుల కస్టడీకి అనుమతించాలని అభ్యర్థించారు. పోలీసుల వాదనలు విన్న న్యాయస్థానం, రెండు రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నెల్లూరు జిల్లాలోనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని మరింత లోతుగా విచారించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *