మావోయిస్టు పార్టీ అగ్రనేత హిడ్మాతో పాటు పలువురు మావోయిస్టుల మృతి నేపథ్యంలో, ఎన్‌కౌంటర్లకు నిరసనగా మావోయిస్టు పార్టీ రేపు (నవంబర్ 23) భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. అల్లూరి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్లను బూటకమంటూ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ లేఖలో, అనారోగ్యంతో చికిత్స కోసం విజయవాడకు వచ్చిన నిరాయుధులైన హిడ్మా, అతడి భార్యతో సహా ఇతర మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకుని, మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో కాల్చి చంపారని ఆరోపించారు.
నవంబర్ 18న అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మాతో పాటు ఆయన భార్య మరియు మరో నలుగురు మావోయిస్టులు మరణించగా, మరుసటి రోజు జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో మరో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు. ఈ వరుస ఎన్‌కౌంటర్లకు నిరసనగా మరియు పోలీసుల చర్యను ఖండిస్తూ దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది.
మావోయిస్టు పార్టీ ఇచ్చిన భారత్ బంద్ పిలుపు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం, పోలీసులు మరియు భద్రతా బలగాలు పూర్తిస్థాయిలో అప్రమత్తమయ్యాయి. పలుచోట్ల పోలీసు బందోబస్తును పటిష్టం చేశారు. అల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంత పోలీసులు ప్రత్యేకించి అలర్ట్ అయ్యారు. ప్రజాప్రతినిధులు ఏజెన్సీ ప్రాంతాలను వదిలి మైదాన ప్రాంతాలకు వెళ్లాలని ఇప్పటికే సూచనలు చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో రాత్రివేళ బస్సుల రాకపోకలపైనా ఆంక్షలు విధించారు.