కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై కొనసాగుతున్న రాజకీయ ఊహాగానాలకు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెరదించారు. ఐదేళ్ల పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్యనే కొనసాగుతారని, ఆయనకు తాము పూర్తి సహకారాన్ని అందిస్తామని డీకే స్పష్టం చేశారు. గ్రూపు రాజకీయాలు చేయడం తన రక్తంలో లేదని ఉద్ఘాటించిన డీకే, కాంగ్రెస్ పార్టీకి చెందిన 140 మంది ఎమ్మెల్యేలు కూడా తనవారే అని వ్యాఖ్యానించారు. ఈరోజు డీకే వర్గం ఎమ్మెల్యేల బృందం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సిద్ధరామయ్య చెప్పిన నేపథ్యంలోనే పలువురు ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి అధిష్ఠానం పెద్దలను కలిశారని డీకే శివకుమార్ వివరించారు. వారు కేవలం మంత్రి పదవుల కోసమే కలిశారని, అది సహజమేనని, ఇందులో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు. ఎమ్మెల్యేలు తమంతట తామే వెళ్లారని స్పష్టం చేస్తూ, గ్రూపు రాజకీయాల ప్రచారాన్ని కొట్టిపారేశారు. మరోవైపు, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రణ్‌దీప్ సుర్జేవాలా కూడా నాయకత్వ మార్పుపై జరుగుతున్న ప్రచారం బీజేపీ చేస్తున్న దుష్ప్రచారమని తోసిపుచ్చారు.
ఈ మొత్తం వ్యవహారంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరియు అధిష్ఠానం కూడా స్పందించారు. నాయకత్వ మార్పుపై పార్టీ అధిష్ఠానం మాత్రమే నిర్ణయం తీసుకుంటుందని, ఖర్గే, గాంధీల నిర్ణయమే శిరోధార్యమని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. అధిష్ఠానం మాటకు తాను మరియు డీకే శివకుమార్ కట్టుబడి ఉంటామని తెలిపారు. నిత్యం జరుగుతున్న ఈ సీఎం మార్పు చర్చ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీస్తోందని సిద్ధరామయ్య ఖర్గేకు ఫోన్ చేసి వివరించగా, ఈ అంశానికి తెరదించుతామని ఖర్గే హామీ ఇచ్చారు.