జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు మరియు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మరోసారి సంచలన సవాల్ విసిరారు. నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఎన్నికల హామీని నెరవేరిస్తే, తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని మరియు బీహార్‌ను విడిచి వెళ్లిపోతానని ప్రకటించారు. ఆ హామీ ఏంటంటే—స్వయం ఉపాధి పథకాల కింద 1.5 కోట్ల మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు వారి ఖాతాల్లో జమ చేస్తామని ఎన్డీఏ ఇచ్చింది. ఆ డబ్బు చెల్లిస్తే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని పీకే స్పష్టం చేశారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన జన్ సురాజ్ పార్టీ 200కు పైగా స్థానాల్లో పోటీ చేసినా, ఒక్క సీటు కూడా గెలవలేకపోవడంపై పీకే స్పందించారు. ఈ ఘోర పరాజయానికి తానే పూర్తి బాధ్యత వహిస్తున్నానని చెబుతూ, ఎన్నికల్లో గెలవడానికి కష్టపడినా ఓట్లు సాధించడంలో విఫలమయ్యామని అంగీకరించారు. అయితే, ఈ ఎదురుదెబ్బ తాత్కాలికమేనని, భవిష్యత్తులో విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. “నేను బీహార్‌ను వదిలి వెళ్లను. మేము మూడు సంవత్సరాలుగా చేసిన కృషికి ఇప్పుడు రెండింతలు కష్టపడి పనిచేస్తాము” అని పీకే అన్నారు.
ఎన్డీఏ కూటమి తమ అఖండ విజయాన్ని భారీ హామీలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన కింద చేసిన చెల్లింపుల ద్వారా సాధించిందని పీకే ఆరోపించారు. ఎన్డీఏ ఎన్నికల సమయంలో దాదాపు రూ. 40,000 కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తామని హామీ ఇవ్వడమే ఇంత పెద్ద మెజారిటీ రావడానికి ప్రధాన కారణమని అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రూ.10,000 చొప్పున 60,000 ఓట్లు కొనుగోలు చేయడం జరిగిందని పీకే అనుమానం వ్యక్తం చేశారు. ఎన్డీఏ ఆరు నెలల్లో మహిళల ఖాతాల్లో రూ. 2 లక్షలు జమ చేయకపోతే జన్ సూరజ్ పార్టీ వారి పక్షాన పోరాడుతుందని పీకే హెచ్చరించారు.