తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా, టేక్మాల్ పోలీస్ స్టేషన్ ఎస్సై రాజేష్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. ఒక కేసు విషయంలో ఎస్సై రాజేష్ రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా, పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఏసీబీ అధికారులను చూడగానే ఆందోళనకు గురైన ఎస్సై రాజేష్, పారిపోయే ప్రయత్నంలో వెంటనే పక్కనే ఉన్న పొలాల్లోకి పరుగు తీశాడు.
అయినప్పటికీ, ఏసీబీ అధికారులు ఏ మాత్రం వెనుకాడకుండా ఎస్సైను వెంబడించి, చివరకు పట్టుకున్నారు. అనంతరం, అతడిని పోలీస్ స్టేషన్కు తరలించి, కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
అవినీతికి పాల్పడుతున్న ఎస్సై రాజేష్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడటంపై టేక్మాల్ గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామస్థులు పోలీస్ స్టేషన్ ఎదుట టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.