ఆపరేషన్ సింధూర్ (Operation Sindhoor) 88 గంటల్లో పూర్తైన ట్రైలర్ మాత్రమే అని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది (Upendra Dwivedi) కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఏ పరిస్థితికైనా భారత సైన్యం సిద్ధంగా ఉందని, పాకిస్తాన్ (Pakistan) మరో అవకాశం ఇస్తే, పొరుగు దేశంతో ఎలా ప్రవర్తించాలో చూపిస్తామని అన్నారు. ఉగ్రవాదులకు, వారి మద్దతుదారులకు కఠిన సమాధానం ఇవ్వడానికి సైన్యం సిద్దంగా ఉందన్నారు. సైన్యం ఇప్పటికే చేపట్టిన ఆపరేషన్‌లు ఉదాహరణలు మాత్రమే అన్న ద్వివేది.. అవసరమైతే మరిన్నీ అపరేషన్లు చేపడుతామని స్పష్టం చేశారు.
గత ఏడాది కాలంలో చైనా, భారతదేశాల నాయకత్వం మధ్య జరిగిన చర్చల తర్వాత ఇరు దేశాల సంబంధాలలో మెరుగుదల ఉందని ఆర్మీ చీఫ్ అన్నారు. పాకిస్తాన్ నుండి సరిహద్దు ఉగ్రవాదం గురించి జనరల్ ద్వివేది మాట్లాడుతూ, పాకిస్తాన్‌తో వ్యవహరించడంలో న్యూఢిల్లీ కొత్త సాధారణ విధానాన్ని అనుసరిస్తోందని, భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇవ్వడం కొనసాగిస్తే పొరుగు దేశానికి అది సవాలుగా మారుతుందని ద్వివేది హెచ్చరించారు.
“భారతదేశం పురోగతి, శ్రేయస్సుపై దృష్టి పెడుతుంది. మన మార్గంలో ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే, వారిపై మనం కొంత చర్య తీసుకోవలసి ఉంటుంది” అని ఆయన అన్నారు. “చర్చలు, ఉగ్రవాదం కలిసి సాగలేవని మేము చెప్పాము. రక్తం నీరు కలిసి ఉండలేవు. మేము శాంతియుత ప్రక్రియను కోరుకుంటున్నాము. దానికే మేము సహకరిస్తాము. అప్పటి వరకు, మేము ఉగ్రవాదులను, వారి స్పాన్సర్లను ఒకేలా చూస్తాము” అని ఆర్మీ చీఫ్ అన్నారు.
పాకిస్తాన్ నుంచి అణు ముప్పును ప్రస్తావిస్తూ .. “నేడు, భారతదేశం ఎటువంటి బ్లాక్‌మెయిలింగ్‌లకు భయపడని స్థితిలో ఉంది” అని ఆయన అన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత కొత్త స్థితి పాకిస్తాన్‌కు సవాలుగా ఉంటుందని ఆయన అన్నారు. భారత రాజకీయ నాయకులు దేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయాలనే సంకల్పం కలిగి ఉన్నారని ఆర్మీ చీఫ్ అన్నారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని జనరల్ ద్వివేది అన్నారు. “ఈ పరిణామం తరువాత రాజకీయ స్పష్టత వచ్చింది. ఉగ్రవాదంలో భారీ తగ్గుదల కనిపించింది” అని ఆయన అన్నారు. రాష్ట్రంలో పరిస్థితి మెరుగుపడుతున్నందున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మణిపూర్ సందర్శించడాన్ని పరిగణించవచ్చని ఆర్మీ చీఫ్ సూచించారు.