సంజూ శాంసన్‌కు సీఎస్కే కెప్టెన్సీ పగ్గాలు?

గత సీజన్ వరకు రాజస్థాన్ రాయల్స్ (RR) కెప్టెన్‌గా ఉన్న సంజూ శాంసన్, వచ్చే ఐపీఎల్ సీజన్ (IPL 2026) నుంచి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరపున ఆడనున్నాడు. రూ. 18 కోట్ల ధరకే అతను ట్రేడ్ డీల్ ద్వారా జట్టు మారాడు. ఐపీఎల్‌లో 177 మ్యాచ్‌లు ఆడిన అనుభవం సంజూకు ఉంది. 2013లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన సంజూ, 2016 మరియు 2017 సీజన్లలో మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడాడు. సంజూ శాంసన్ సీఎస్కేలోకి రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సీఎస్కేలోకి సంజూ శాంసన్ రాకతో, ధోనీ (MS Dhoni) తర్వాత జట్టు పగ్గాలు ఎవరికి అన్న ప్రశ్నకు సమాధానం దొరికిందనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో ధోనీ కెప్టెన్సీ బాధ్యతలను రుతురాజ్‌కు (Ruturaj) అప్పగించినా, మళ్లీ ధోనీనే కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాల్సి వచ్చింది. అయితే, ఈ కెప్టెన్సీ సమస్యకు సంజూ శాంసనే శాశ్వత పరిష్కారం అవుతాడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. సంజూకి రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం ఉండటం ఈ అభిప్రాయాలకు బలం చేకూర్చింది.

సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకోవడం కోసం, జట్టు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చెన్నై సూపర్ కింగ్స్ రవీంద్ర జడేజాతో పాటు సామ్ కరన్‌లను రాజస్థాన్ రాయల్స్‌కు ట్రేడ్ డీల్‌లో భాగంగా వదులుకుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి, సంజూ శాంసన్ రాకతో సీఎస్కేలో కొత్త శకం మొదలు కానుందని, రాబోయే రోజుల్లో ధోనీ వారసుడిగా సంజూ జట్టు పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని క్రీడా వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *