ఢిల్లీ పేలుడు కేసు: పంజాబ్ సర్జన్, ఎంబీబీఎస్ విద్యార్థి అరెస్ట్ – వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ ఉనికి ధ్రువీకరణ

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కార్ బాంబు పేలుడు కేసు దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సంచలన విషయాలు వెల్లడించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న అనుమానితులుగా పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌కు చెందిన ఒక సర్జన్‌ను, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక ఎంబీబీఎస్ విద్యార్థిని ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. ఉన్నత విద్యావంతులు మరియు వైద్య నిపుణులు ఉగ్రవాద కార్యకలాపాల్లో భాగస్వాములు కావడం ‘వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్’ ఉనికిని ధృవీకరిస్తోంది. హర్యానాలోని అల్-ఫలా యూనివర్సిటీతో సంబంధాలు ఉన్న ఈ ఇద్దరిని అరెస్ట్ చేయడం ద్వారా, దేశవ్యాప్తంగా విస్తరించిన ఈ నెట్‌వర్క్ మూలాలను ఛేదించేందుకు ఎన్‌ఐఏ విచారణను మరింత వేగవంతం చేసింది.

అరెస్ట్ అయిన ఎంబీబీఎస్ విద్యార్థిని పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర దినాజ్‌పూర్‌కు చెందిన జనిసూర్ అలియాస్ నిసార్ ఆలంగా గుర్తించారు. నిసార్ గతంలో హర్యానాలోని అల్-ఫలా యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఉగ్రవాద సంస్థలతో అతనికి సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఎన్‌ఐఏ అతన్ని సూరజ్‌పూర్ మార్కెట్‌లో అదుపులోకి తీసుకుంది. అతని మొబైల్ లొకేషన్ డేటా ఆధారంగా కదలికలపై నిఘా ఉంచిన అధికారులు, అతని నుంచి పలు డిజిటల్ పరికరాలు, ముఖ్య పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం నిసార్‌ను సిలిగురికి తరలించారు. నవంబర్ 10వ తేదీన జరిగిన ఈ పేలుడులో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.

నిసార్ అరెస్టుతో పాటు, పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌కు చెందిన 45 ఏళ్ల సర్జన్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వైద్యుడు రెండు సంవత్సరాలకు పైగా పఠాన్‌కోట్‌లోని ఒక ప్రైవేట్ వైద్య కళాశాల ఆసుపత్రిలో పనిచేస్తుండగా, గతంలో ఫరీదాబాద్‌లోని అల్-ఫలా యూనివర్సిటీలో కూడా పని చేశారని పోలీస్ వర్గాలు తెలిపాయి. ‘వైట్‌కాలర్ టెర్రర్ మాడ్యూల్‌’ కేసులో ఉన్న ప్రధాన అనుమానితులతో ఈ డాక్టర్‌కు సంబంధాలు ఉన్నాయని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఎన్‌ఐఏ దేశవ్యాప్తంగా ఢిల్లీ, ముంబై సహా పలు నగరాల్లో దర్యాప్తును కొనసాగిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *