బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి భారీ ఓటమి చవి చూసిన నేపథ్యంలో, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె రాజకీయాలకు పూర్తిగా వీడ్కోలు పలికినట్లు, అంతేకాక తన కుటుంబ సభ్యులతో సంబంధాలు తెంచుకుంటున్నట్లు ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌లో ఆమె తన సోదరుడు తేజస్వి యాదవ్ సన్నిహితులైన సంజయ్ యాదవ్, రమీజ్‌లపై కూడా పరోక్షంగా ఆరోపణలు చేశారు. ఈ రాజీనామా ఆర్జేడీలో మరో సంక్షోభాన్ని సృష్టించింది, ఇప్పటికే లాలూ కుటుంబంలో ఉన్న అంతర్గత విభేదాలు మరింత పెరగడానికి దారితీసింది.
రోహిణి ఆచార్య శనివారం ఎక్స్‌లో పోస్ట్ చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. తాను ఆర్జేడీలో చేసిన కృషిని, కుటుంబానికి చేసిన సేవలను ఆమె ఈ పోస్ట్‌లో ప్రస్తావించారు. 2022లో తన తండ్రి లాలూ యాదవ్‌కు కిడ్నీ డొనేట్ చేసిన విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటూ, తాను ఎప్పుడూ కుటుంబం కోసం పోరాడానని, కానీ ఇప్పుడు ఆ పోరాటం ముగిసిపోయిందని తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో సరాన్ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కూడా ఆమె పార్టీలో చురుకుగా ఉంటూ తేజస్వి యాదవ్‌కు మద్దతుగా నిలిచారు. అయితే, పార్టీలో అంతర్గత విభేదాలు, ముఖ్యంగా తేజస్వి సన్నిహితుడైన సంజయ్ యాదవ్ జోక్యంపై విమర్శలు పెరగడంతో రోహిణి సెప్టెంబర్ 2025 నుంచే పార్టీకి దూరమయ్యారు.
తాజాగా రోహిణి పోస్ట్‌లో ప్రస్తావించిన సంజయ్ యాదవ్, ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ మరియు తేజస్వి యాదవ్ సన్నిహితుడు. 2025 సెప్టెంబర్‌లో బీహార్ అధికార్ యాత్ర సందర్భంగా సంజయ్ తేజస్వి వానిటీ వ్యాన్‌లో ఫ్రంట్ సీట్ తీసుకున్నారని రోహిణి గతంలో విమర్శించారు. “ఫ్రంట్ సీట్ పార్టీ లీడర్‌కు మాత్రమే” అని పోస్ట్ చేసి, తర్వాత డిలీట్ చేశారు. లాలూ కుటుంబం, ఆర్జేడీ నేతలు ఇప్పటివరకు రోహిణి ప్రకటనపై అధికారికంగా స్పందించనప్పటికీ, రాజకీయ విశ్లేషకులు దీనిని ఆర్జేడీకి మరో షాక్గా పరిగణిస్తున్నారు. ఆమె సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా పార్టీకి దూరమై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోవడం, ఇప్పుడు రోహిణి రాజీనామా చేయడం కుటుంబ విభేదాలు పార్టీని మరింత బలహీనపరుస్తాయని అంచనా వేస్తున్నారు.