బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మోహన్ బాబు నటించిన ‘అసెంబ్లీ రౌడీ’ సినిమాను గుర్తుచేసే సన్నివేశం చోటు చేసుకుంది. గ్యాంగ్‌స్టర్‌గా రాజకీయ నాయకుడిగా ఎదిగిన అనంత్ కుమార్ సింగ్, హత్య కేసులో ప్రస్తుతం జైలులో ఉన్నప్పటికీ, మొకామా నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు. ఆయన జేడీయూ అభ్యర్థిగా పోటీ చేసి, ఆర్జేడీ అభ్యర్థి వీణా దేవిని 28,206కు పైగా ఓట్ల భారీ తేడాతో ఓడించారు.
అనంత్ కుమార్ సింగ్ విజయం వెనుక ఆయన అనుచరులు చేసిన హంగామా కూడా ఉంది. ఫలితాలు వెలువడక ముందే ఆయన అనుచరులు పెద్ద ఎత్తున పోస్టర్లు అంటించి, “జైలు గేట్లు కూలతాయి.. మా సింహం వస్తోంది” అంటూ రచ్చ రచ్చ చేశారు. నవంబర్ 2న జన సురాజ్ పార్టీ పోలింగ్ వర్కర్ దులార్ చంద్ యాదవ్ హత్య కేసులో అరెస్టు అయిన అనంత్ కుమార్ సింగ్, జైలు నుంచే ఎన్నికల్లో గెలుపొందడం ఈ ఎన్నికల్లో ఒక సంచలనం.
రాజకీయంగా అనంత్ కుమార్ సింగ్‌కు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఆయనపై ఏకంగా 28 క్రిమినల్ కేసులు ఉన్నప్పటికీ, 2005లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, ఇప్పుడు సాధించింది ఆరో విజయం. పార్టీలు మారడం అంటే ఆయనకు చాలా ఇష్టం. కొన్నేళ్లు ఆర్జేడీలో, మరికొన్నేళ్లు జేడీయూలో కొనసాగిన ఆయన, ఈసారి జేడీయూ తరఫున పోటీ చేసి గెలిచారు.