ఢిల్లీలోని చారిత్రక కట్టడం ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడు ఘటన దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పేలుడు పదార్థాలతో నిండిన హ్యుందాయ్ ఐ20 కారులో ఘటన సమయంలో ఉన్న వ్యక్తి ఉగ్రవాది డాక్టర్ ఉమర్ నబీ (ఉమర్ మొహమ్మద్) అని డీఎన్ఏ పరీక్ష ద్వారా అధికారులు నిర్ధారించారు. కారు శిథిలాల నుంచి లభించిన అవశేషాలు (ఎముకలు, దంతాలు, దుస్తుల ముక్కలు) పుల్వామాలోని అతని కుటుంబ సభ్యుల డీఎన్ఏ నమూనాలతో సరిపోలాయి. దీంతో పేలుడు జరిగే సమయానికి ఉమర్ కారులోనే ఉన్నాడని, ప్రాణాలు కోల్పోయాడని అధికారులు ఖరారు చేశారు.
ఎర్రకోట వద్ద నవంబర్ 10న జరిగిన ఈ విధ్వంసకర దాడిలో మృతుల సంఖ్య 12కు చేరింది. బుధవారం రాత్రి విడుదల చేసిన సీసీటీవీ ఫుటేజీల ప్రకారం, బాంబు పేలుడు సాయంత్రం 6:52 గంటలకు జరిగినట్లు స్పష్టమైంది. పేలుడుకు ముందు ఉమర్ కారు నడుపుతున్న దృశ్యాలను అధికారులు గుర్తించారు. హరియాణాలోని ఫరీదాబాద్‌లో భారీగా పేలుడు పదార్థాలు లభ్యమైన ఘటనకు, ఎర్రకోట పేలుడుకు సంబంధం ఉందని విచారణలో తేలింది. ఈ నేపథ్యంలోనే డాక్టర్ సాహీన్ సయీద్ మరియు డాక్టర్ గనయీలను పోలీసులు అరెస్టు చేశారు.
డాక్టర్ ఉమర్ నబీ దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులు చేయాలని ఉద్వేగభరితంగా మాట్లాడేవాడని దర్యాప్తులో తెలిసింది. డాక్టర్ ముజమ్మిల్, ఆదిల్‌తో కలిసి దాదాపు రెండేళ్ల నుంచి అమ్మోనియం నైట్రేట్ వంటి పేలుడు పదార్థాలను సేకరించి, పాక్‌కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ కోసం దేశవ్యాప్తంగా దాడులు చేసేందుకు సన్నాహాలు చేసినట్లు బయటపడింది. ఫరీదాబాద్ ఉగ్ర కుట్రలో భాగస్వామి అయిన డాక్టర్ షాహీన్‌ను విచారించినప్పుడు ఈ కీలక వివరాలు వెల్లడైనట్లు సమాచారం.