ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, తమ ‘సూపర్ సిక్స్’ హామీల్లో భాగమైన ‘స్త్రీ శక్తి’ పథకం అమలుపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించే ఈ పథకానికి సంబంధించిన రూ.400 కోట్ల నిధులను ఏపీ ప్రభుత్వం తాజాగా మంజూరు చేసింది. ఈ నిధులను పథకం ప్రారంభమైన ఆగస్ట్ 15వ తేదీ నుంచి అక్టోబర్ నెల వరకు అయిన ఖర్చులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ)కి విడుదల చేశారు.
‘స్త్రీ శక్తి’ పథకం కింద మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నప్పటికీ, వారికి బస్సుల్లో జీరో టికెట్లు జారీ చేస్తారు. ఈ జీరో టికెట్ల ఆధారంగా అయ్యే మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తుంది. అయితే, ఆగస్ట్‌లో పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఈ బకాయిలను ప్రభుత్వం చెల్లించలేదు. దీంతో తాజాగా మూడు నెలల జీరో ఫేర్ టికెట్ల ఖర్చుకు సంబంధించిన రూ.400 కోట్ల నిధులను చంద్రబాబు సర్కార్ విడుదల చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
‘స్త్రీ శక్తి’ పథకంలో భాగంగా ఆర్టీసీకి నిధులు విడుదల చేయడంపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఆర్టీసీ ఎన్ఎంయూఏ, అలాగే ఆర్టీసీ కార్మిక పరిషత్ నేతలు ఈ నిర్ణయం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధుల విడుదల ఆర్టీసీకి ఆర్థికంగా కొంత ఊరటనిస్తుందని భావిస్తున్నారు.