ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనపై జరుగుతున్న దర్యాప్తులో ఫరీదాబాద్‌కు చెందిన మెడికల్ లెక్చరర్ డాక్టర్ షాహీన్ షాహిద్ పాత్ర కీలకంగా వెలుగులోకి వచ్చింది. ఆమె పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ (JeM) తరఫున పనిచేసినట్లు అధికారులు గుర్తించారు. దేశంలో JeM యొక్క మహిళా ఉగ్రవాద విభాగాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా షాహీన్ కార్యకలాపాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
డాక్టర్ షాహీన్ విద్యా నేపథ్యం ప్రకారం, ఆమె 1979లో లక్నోలో జన్మించింది. ప్రయాగ్‌రాజ్ మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్, ఎండీ పూర్తి చేసింది. కాన్పూర్ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కూడా పనిచేసిన ఆమె, 2013లో ఉద్యోగాన్ని వదిలి వెళ్లిపోయింది. భర్త డాక్టర్ జాఫర్ సయీద్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత, ఆమె ఉగ్రవాద నిధుల కేసులో నిందితుడైన డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనైతో సంబంధాన్ని కొనసాగించింది. ఆ తర్వాత హర్యానాలోని అల్-ఫలాహ్ యూనివర్సిటీతో సంబంధాలు ఏర్పరుచుకుని JeM నెట్‌వర్క్ కార్యకలాపాలను అక్కడి నుంచే కొనసాగించింది.
దర్యాప్తు వివరాల ప్రకారం, జైష్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ నేరుగా షాహీన్‌కు ఆదేశాలు ఇచ్చింది. సాదియా పాకిస్తాన్‌లో JeM మహిళా విభాగానికి నాయకత్వం వహిస్తున్నట్లు తెలిసింది. నవంబర్ 8న షాహీన్ సహచరుడు డాక్టర్ ముజమ్మిల్‌ను అరెస్ట్ చేసినప్పుడు అతని వద్ద AK-47 తుపాకీ, పేలుడు పదార్థాలు లభించాయి. ముజమ్మిల్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే నవంబర్ 11న డాక్టర్ షాహీన్‌ను అరెస్ట్ చేశారు. JeM మహిళా విభాగ కార్యకలాపాల వివరాలపై భద్రతా సంస్థలు మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నాయి.