భూటాన్ పర్యటన ముగించుకుని నేడు దేశానికి తిరిగి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విమానాశ్రయం నుంచి నేరుగా ఢిల్లీలోని లోక్‌నాయక్ జై ప్రకాశ్ నారాయణ్ (LNJP) ఆసుపత్రికి వెళ్లారు. ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడులో గాయపడి అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పిన ప్రధాని, వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా, ఘటన వివరాలు మరియు అందుతున్న వైద్య సహాయం గురించి వైద్యులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ పేలుడు ఘటనపై ప్రధాని మోదీ భూటాన్ పర్యటనలో ఉన్నప్పుడే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “ఈ దుఃఖ సమయంలో దేశం మొత్తం బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తుంది. మన ఏజెన్సీలు ఈ ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేస్తాయి. బాధ్యులైన వారందరినీ చట్టం ముందు నిలబెడతాం” అని ఆయన థింఫులో వ్యాఖ్యానించారు. ఢిల్లీకి తిరిగి రాగానే ఆయన వెంటనే బాధితులను పరామర్శించడం, ఈ ఘటనపై ప్రభుత్వం యొక్క సీరియస్‌నెస్‌ను తెలియజేసింది.
మరోవైపు, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ముమ్మరం చేసింది. దర్యాప్తు కోసం ఒక ఐజీ నేతృత్వంలో 10 మంది అధికారులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఘటన గరిష్ఠ నష్టం కలిగించే లక్ష్యంతో జరిపిన ఆత్మాహుతి దాడి అయి ఉండవచ్చని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. దీని నేపథ్యంలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ముంబై సహా పలు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు.