ఏపీలో ట్రాఫిక్ రూల్స్ మార్పు: చలానాల కంటే ‘అవగాహన, కౌన్సెలింగ్‌’కే ప్రాధాన్యం

ఆంధ్రప్రదేశ్‌లో ట్రాఫిక్ నిబంధనల అమలులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆదేశించారు. ఇప్పటివరకు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చలానాలు వేయడంపైనే పోలీసులు ఎక్కువగా దృష్టి పెట్టేవారని, అయితే ఇకపై ఈ విధానం పూర్తిగా మారనుందని సీఎం స్పష్టం చేశారు. ట్రాఫిక్ పోలీసుల ప్రాథమిక లక్ష్యం ఆదాయం కంటే రోడ్డు ప్రమాదాల నివారణ మరియు వాహనదారుల భద్రతకే ఉండాలని సీఎం సూచించారు.

సీఎం చంద్రబాబు నాయుడు ఆర్టిజిఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ) పై సమీక్ష నిర్వహిస్తూ, ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే కేవలం చలానాలు వేసి వదిలిపెట్టడం కాకుండా, ఆ తప్పు వల్ల కలిగే ప్రమాదాల గురించి తెలియజేయాలని సూచించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే, వెంటనే చలానా వేయకుండా, వారు చేసిన తప్పేమిటో తెలియజేస్తూ ఫోన్‌కు మెసేజ్ పంపాలని ఆదేశించారు. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసేవారికి అవసరమైతే ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించాలని కూడా సూచించారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, ట్రాఫిక్ రూల్స్ పాటించని వారికి మొదటిసారి చేసిన తప్పేమిటో తెలియజేయడం ద్వారా వారిలో మార్పు తీసుకురావాలి. అయినప్పటికీ, వారు రెండోసారి కూడా అలాంటి తప్పులే చేస్తే, అప్పుడు మాత్రమే చలానాలతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ట్రాఫిక్ పోలీసులపై ప్రజల్లో ఉన్న ‘డబ్బులు వసూలు చేస్తారు’ అనే భావన పోయి, ‘మన రక్షణ కోసమే నిబంధనలు’ అనే అవగాహన రావాలని సీఎం ఆకాంక్షించారు. ట్రాఫిక్ రూల్స్ విషయంలో కేరళ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కూడా చంద్రబాబు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *