బీహార్ ఎగ్జిట్ పోల్స్: బీజేపీ కూటమికి ఓబీసీ, ఎస్సీ ఓటర్ల మొగ్గు; ముస్లింల మద్దతు మహాఘట్‌బంధన్‌కే

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఘన విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు బలంగా సూచిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం ఎన్డీయేకు 145 నుంచి 150 సీట్లు, మహాఘట్‌బంధన్‌కు 90 సీట్ల వరకు రావచ్చని అంచనా. ఈ ఫలితాల సరళిని పరిశీలిస్తే, బీహార్‌లో ఏ సామాజిక వర్గం ఎవరి వైపు మొగ్గు చూపిందనే కీలక అంశాలు వెల్లడయ్యాయి.

మంగళవారం సాయంత్రం విడుదలైన మాట్రిజ్ ఎగ్జిట్ పోల్ డేటా ప్రకారం, బీహార్‌లో ఓబీసీలు మరియు ఎస్సీ సామాజిక వర్గాలు ముఖ్యంగా బీజేపీ, నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూకు అనుకూలంగా ఓట్లు వేశాయి. ఓబీసీ ఓటర్లలో 51 శాతం మంది, ఎస్సీ ఓటర్లలో 49 శాతం మంది బీజేపీ, జేడీయూ కూటమికి అనుకూలంగా ఓటు వేసినట్లు ఈ డేటా వెల్లడించింది. దీనికి విరుద్ధంగా, ముస్లిం వర్గం ఓట్లలో 78 శాతం వరకు ఆర్జేడీ, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్‌కు పడి ఉంటాయని అంచనా.

సామాజిక వర్గాల వారీగా మొగ్గు పరిశీలిస్తే, జనరల్ ఓటర్లలో 69 శాతం మంది ఎన్డీయే వైపు మొగ్గు చూపగా, మహాఘట్‌బంధన్‌కు కేవలం 15 శాతం మాత్రమే దక్కింది. అలాగే, ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీకి ఏ సామాజిక వర్గంలోనూ చెప్పుకోదగిన స్థాయిలో మద్దతు లభించలేదని ఎగ్జిట్ పోల్ డేటా స్పష్టం చేసింది. ఈ ఫలితాలు తుది ఫలితాలకు ఎంత దగ్గరగా ఉంటాయనేది ఉత్కంఠగా మారింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *