తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో, రాబోయే పది రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ మరియు తెలంగాణ ప్రణాళిక అభివృద్ధి సంఘం హెచ్చరించాయి. ముఖ్యంగా నవంబర్ 13 నుంచి 17 తేదీల మధ్య చలి తీవ్రత మరింత అధికంగా ఉంటుందని అంచనా. ఈ సమయంలో రాష్ట్రంలోని రంగారెడ్డి, వికారాబాద్, నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ వంటి జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడిపోయే అవకాశం ఉంది.
ఈ తీవ్ర చలి దృష్ట్యా ఆసిఫాబాద్, భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది. ఈ జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు 9-10 డిగ్రీల మధ్య నమోదవుతాయని అంచనా. ఇతర పలు జిల్లాలకు కూడా కనిష్ఠ ఉష్ణోగ్రతలు 9-15 డిగ్రీల మధ్య నమోదవుతాయని అంచనా వేస్తూ ఎల్లో అలర్ట్ జారీ చేశారు. చలి తీవ్రత పెరుగుతున్నందున, ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు మరియు పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
చలి పెరుగుతుండగా, తీర ప్రాంత ప్రజలను మరో తుపాను ముప్పు వెంటాడుతోంది. ఈ నెల 19 లేదా 20న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, అది తుపానుగా మారి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర వైపు వచ్చే అవకాశం ఉందని ఇస్రో నిపుణుడు అంచనా వేశారు. ఈ తుఫాను ప్రభావం తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కూడా స్వల్పంగా ఉండి, జల్లులు పడే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు.