విశాఖకు మరో గుడ్‌న్యూస్: ఈ నెలలోనే లులూ మెగా షాపింగ్ మాల్ శంకుస్థాపన!

విశాఖపట్నం వాసులకు ఈ నెలలో మరో శుభవార్త అందనుంది. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం జరిగిన నేపథ్యంలో, ప్రముఖ అంతర్జాతీయ సంస్థ లులూ (Lulu) మెగా షాపింగ్ మాల్ నిర్మాణానికి ఈ నెలలోనే శంకుస్థాపన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖ వేదికగా సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII Partnership Summit) నిర్వహించనున్నారు. ఈ సదస్సు సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లులూ మెగా షాపింగ్ మాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

లులూ ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు విశాఖ బీచ్‌ రోడ్డులోని హార్బర్‌ పార్క్‌లో ఏపీ ప్రభుత్వం 13.74 ఎకరాల భూమిని 99 ఏళ్ల లీజు ప్రాతిపదికన ఇప్పటికే కేటాయించింది. ఇందులో 13.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో లులూ మెగా షాపింగ్‌ మాల్‌ నిర్మించనున్నారు. ఈ మాల్‌లో లులూ సూపర్‌మార్కెట్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సెంటర్‌, అమ్యూజ్‌మెంట్ పార్కు, 8 స్ర్కీన్ల మల్టీప్లెక్స్ వంటి అత్యాధునిక సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. ఈ మెగా షాపింగ్ మాల్ ఏర్పాటు వల్ల 5 వేల నుంచి 8 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా.

విశాఖలో భూముల కేటాయింపుపై ఎటువంటి అభ్యంతరాలు లేకపోవడంతో, ఈ నెలలోనే శంకుస్థాపన జరగవచ్చని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, విజయవాడలో కూడా లులూ షాపింగ్ మాల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికోసం 4.15 ఎకరాల భూమిని కేటాయించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. అయితే, గుర్తించిన స్థలం ఆర్టీసీ పరిధిలో ఉండటం వల్ల అభ్యంతరాలు వ్యక్తమవుతుండటంతో, అక్కడ ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించే ఆలోచన చేస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *