మాజీ మంత్రి పేర్ని నాని రాజకీయాల్లో మంచి వాగ్దాటి ఉన్న నేతగా గుర్తింపు పొందారు. మచిలీపట్నంలో కాపు సామాజికవర్గం నుంచి ఆయనకు బలమైన మద్దతు ఉండేది. అయితే, 2019 ఎన్నికల తర్వాత పేర్ని నాని వ్యవహార శైలిపై ఆయన సొంత సామాజికవర్గంలోనే వ్యతిరేకత మొదలైంది. ముఖ్యంగా, జగన్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న సమయంలో నాని ఒంటికాలిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై లేస్తూ, తీవ్ర విమర్శలు చేయడమే ఈ వ్యతిరేకతకు ప్రధాన కారణమని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ కారణం వల్లనే అంతకుముందు బలంగా అండగా నిలిచిన కాపు సామాజికవర్గం నానికి దూరమైంది.
అయితే, ప్రస్తుతం మచిలీపట్నం రాజకీయ పరిస్థితుల్లో క్రమంగా మార్పులు కనిపిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. పవన్ కల్యాణ్ గత పదహారు నెలలుగా కొంత మౌనంగా ఉండటం, కందుకూరు ఘటనపై స్పందించకపోవడం, గతంలో మచిలీపట్నంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వంటి కారణాల వల్ల కాపుల్లో కొంత అసంతృప్తి మొదలైంది. అంతేకాకుండా, కూటమి సర్కార్ అధికారంలో ఉన్నప్పటికీ, నామినేటెడ్ పదవులు కొందరికే దక్కుతున్నాయనే భావనతో కాపులు క్రమంగా పేర్ని నానికి అనుకూలంగా మారుతున్నారన్నది తాజా విశ్లేషణ.
మరోవైపు, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఈ సానుకూలత నాని వైపు ఫలితాలు తీసుకువస్తుందనే విశ్లేషణలు ఉన్నాయి. మచిలీపట్నం జనసేనలో కూటమి సర్కార్‌పై, ముఖ్యంగా టీడీపీపై కొంత అసహనం ఏర్పడింది. పవన్ కల్యాణ్ కూడా తమను పట్టించుకోవడం లేదన్న అభిప్రాయంలో పార్టీ కోసం కష్టపడినవారు ఉన్నారు. ఈ పరిస్థితులను పేర్ని నాని రాజకీయంగా ఉపయోగించుకునే అవకాశముంది. ఇప్పటికే మంత్రి కొల్లు రవీంద్ర కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణంపై రోడ్డు విస్తరణ పనులను నాని బయటకు తెచ్చి, తన వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.