ధరల మోతపై సుప్రీంకోర్టు విస్మయం
సినిమా థియేటర్లలో, ముఖ్యంగా మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరలు మరియు తినే వస్తువుల ధరల మోతపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ధరల తీరు చూసి న్యాయస్థానం “వామ్మో.. ఇవేం ధరలు” అని విస్మయం వ్యక్తం చేసింది. ఒక్క నీళ్ల బాటిల్‌కు ₹100, కప్పు కాఫీకి ₹700 వసూలు చేయడాన్ని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం తీవ్రంగా తప్పు పట్టింది. సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు సినిమా చూడాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే అన్న అభిప్రాయం నెలకొందని కోర్టు వ్యాఖ్యానించింది.
కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంపై విచారణ
మల్టీప్లెక్స్‌లలో ధరలపై సుప్రీంకోర్టు సీరియస్ అవడానికి ప్రధాన కారణం, కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే. మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధర ₹200 మించకూడదు అని కర్ణాటక ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటక మల్టీప్లెక్స్ థియేటర్ల ఓనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఈ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా, టికెట్ ధర రూ.200 ఉండాలనే హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాన్ని తాము సమర్థిస్తున్నామని జస్టిస్ విక్రమ్ నాథ్ తెలిపారు.
థియేటర్లు మూసుకోవాల్సి వస్తుందని హెచ్చరిక
అత్యధిక ధరలు ఇలానే కొనసాగితే సినిమా హాళ్లు మూసుకోవాల్సి వస్తుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. టికెట్ ధరలతో పాటు, తినే వస్తువుల ధరలు ప్రజలకు అందుబాటులో లేకపోతే థియేటర్లు ఖాళీ అవడం ఖాయమని న్యాయస్థానం అభిప్రాయపడింది. ప్రస్తుతం సినిమా హాళ్లలో పాప్‌కార్న్ ధరే ₹500 వరకు, బయట ₹50 దొరికే కూల్ డ్రింక్ రేటు ₹400 వరకు ఉంటోందని, దీంతో ఒక కుటుంబం సినిమా చూసేందుకు ₹1,500 నుంచి ₹2,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని కోర్టు పేర్కొంది.