ఐసీసీ వరల్డ్ కప్ హీరో శ్రీ చరణికి ఏపీ ప్రభుత్వం ‘బంపర్ ఆఫర్’

భారత మహిళల క్రికెట్ జట్టు తొలిసారిగా ఐసీసీ మహిళల వరల్డ్ కప్‌ను కైవసం చేసుకోవడంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కడప జిల్లా యువతి నల్లపురెడ్డి శ్రీ చరణి కీలక పాత్ర పోషించారు. ఈ స్ఫూర్తిదాయక విజయంలో భాగస్వామ్యమైన ఆటగాళ్లందరికీ దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ క్రమంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చరణికి ఘన సన్మానం చేయడంతో పాటు బంపర్ ఆఫర్ ప్రకటించడానికి సిద్ధమైంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు తమ విజేత ఆటగాళ్లకు డీఎస్పీ స్థాయి ఉద్యోగాలు ప్రకటించిన నేపథ్యంలో, చరణికీ అదే రీతిలో ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉందని సమాచారం.

వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో చరణి తన బౌలింగ్ ప్రతిభతో ప్రత్యర్థి జట్లను కంగుతినిపించింది. ఆమె తొమ్మిది మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసి భారత బౌలింగ్ విభాగంలో రెండవ అత్యుత్తమ బౌలర్‌గా నిలిచింది. ఎడమచేతి స్పిన్నర్‌గా చరణి ప్రదర్శన ప్రత్యేకంగా నిలిచింది. మిడిల్ ఓవర్లలో ఆమె వేసిన కట్టుదిట్టమైన బౌలింగ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్లను ఎదుర్కొని కీలకమైన వికెట్లు సాధించడం ద్వారా భారత విజయంలో ప్రధాన పాత్ర పోషించింది. ఫైనల్లోనూ ఆమె ప్రశాంతత, అద్భుతమైన బౌలింగ్ భారత విజయానికి మార్గం సుగమం చేసింది.

ఈ విజయానికి గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చరణికి ఘన సన్మానం చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. విజయవాడకు రానున్న చరణిని గన్నవరం నుంచి భారీ ర్యాలీతో ఆహ్వానించేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సన్నాహాలు చేస్తోంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ చరణిని సత్కరించనున్నారు. కడప జిల్లాలోని చిన్న గ్రామం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన చరణి విజయగాథ ఇప్పుడు యువతకు ఆదర్శంగా మారింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *