భారత యువ బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మ ప్రస్తుతం తన కెరీర్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అద్భుతమైన హిట్టింగ్ నైపుణ్యం, బలమైన ఆత్మస్థైర్యంతో టీమిండియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. పవర్‌ప్లేలోనే గేమ్ మొమెంటమ్‌ను మార్చగల సామర్థ్యం ఆయన ప్రత్యేకత. ఈ నేపథ్యంలో, నవంబర్ 6న ఆస్ట్రేలియాతో జరగబోయే నాలుగో టీ20 మ్యాచ్‌లో ఆయన ఒక చారిత్రక రికార్డును సృష్టించే అవకాశం ఉంది.
టీ20 ఇంటర్నేషనల్స్‌లో భారత ఆటగాళ్లలో వేగంగా 1000 పరుగులు చేసిన రికార్డు ప్రస్తుతం విరాట్ కోహ్లీ పేరుపై ఉంది. కోహ్లీ ఈ ఘనతను 27 ఇన్నింగ్స్‌లలో పూర్తి చేసి మైలురాయిని నెలకొల్పాడు. దాదాపు 10 ఏళ్ల తర్వాత అదే రికార్డును సమం చేసే ఛాన్స్ ఇప్పుడు అభిషేక్ శర్మకు లభించింది. ప్రస్తుతం 26 ఇన్నింగ్స్‌లలో 961 పరుగులు చేసిన ఆయనకు రికార్డు సమం చేయడానికి కేవలం 39 పరుగులే అవసరం. నవంబర్ 6న జరిగే మ్యాచ్‌లో ఆయన ఈ పరుగులు చేస్తే, కోహ్లీతో సమానంగా నిలిచి భారత క్రికెట్ చరిత్రలో రెండో ఆటగాడిగా గుర్తింపు పొందుతాడు.
అభిషేక్ శర్మ తన టీ20 అంతర్జాతీయ ప్రయాణాన్ని 2024లో జింబాబ్వేతో ప్రారంభించాడు. ఇప్పటివరకు 27 మ్యాచ్‌లలో 26 ఇన్నింగ్స్‌లు ఆడి, 36.78 సగటుతో 961 పరుగులు సాధించాడు. ఆయన స్ట్రైక్ రేట్ 192.50గా ఉండటం ఆయన దూకుడును స్పష్టంగా చూపుతుంది. ఈ స్వల్ప కాలంలోనే రెండు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలు బాదడం ఆయన ప్రతిభకు నిదర్శనం. రాబోయే ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ ఆయన కెరీర్‌లో ఒక మలుపుగా నిలవవచ్చు.