దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకంలో లబ్ధిదారుల పేర్లను తొలగించే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. కేంద్రం చేపట్టిన ఈ సవరణల వల్ల గత నాలుగు నెలల్లోనే (2024–25 డిసెంబర్ నుండి 2025–26 జులై మధ్య) 35,44,213 మంది రైతుల పేర్లు తొలగించబడ్డాయి. జులై తర్వాత కూడా ఈ ప్రక్రియ కొనసాగుతున్నందున, ప్రస్తుతం తొలగించిన వారి సంఖ్య 60 లక్షల దాకా చేరి ఉండొచ్చని అంచనా.
ఈ తొలగింపుల వెనుక రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని కేంద్రం చెబుతోంది. మొదటిది, పథకం దుర్వినియోగాన్ని అరికట్టడం. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఆదాయపు పన్ను చెల్లించేవారు, ఒకే కుటుంబంలో భార్యాభర్త ఇద్దరూ లబ్ధిపొందడం వంటి అనర్హుల పేర్లను గుర్తించి తొలగించడం ద్వారా నిజమైన రైతులు మాత్రమే లబ్ధి పొందేలా చర్యలు తీసుకుంటున్నారు. రెండవ కారణం, త్వరలో లబ్ధిని రూ.6,000 నుండి రూ.9,000కు పెంచే ఆలోచనలో కేంద్రం ఉండటం. అనర్హులను తొలగించడం ద్వారా ఆదా అయ్యే డబ్బును అర్హులైన రైతుల లబ్ధిని పెంచేందుకు వినియోగించాలని కేంద్రం యోచిస్తోంది.
ఇప్పటికే తొలగించిన 35 లక్షల పేర్లతో కేంద్రానికి సుమారు రూ.2,126 కోట్లు ఆదా కాగా, మరిన్ని పేర్లు తొలగిస్తే మొత్తం ఆదా రూ.5,000 కోట్ల దాకా చేరే అవకాశముంది. అయితే, ఈ తొలగింపుల వల్ల పీఎం కిసాన్ 21వ విడత చెల్లింపులు ఆలస్యమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఇంకా డబ్బు జమ కాలేదు. రైతులు తమ పేర్లు జాబితాలో ఉన్నాయో లేదో pmkisan.gov.in వెబ్‌సైట్‌లో “Know Your Status” ద్వారా చెక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తప్పుగా పేరు తొలగించబడితే తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.