ప్రముఖ సినీ నటుడు, గోరఖ్‌పూర్ బీజేపీ ఎంపీ రవి కిషన్‌కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి హత్య బెదిరింపులు వచ్చాయి. బీహార్ ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన ప్రసంగాలపై ఆగ్రహంతో ఆ వ్యక్తి ఫోన్లో బెదిరించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై రవి కిషన్ వ్యక్తిగత కార్యదర్శి గోరఖ్‌పూర్‌లోని రామ్‌ఘర్ తాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు సెక్షన్ 302 (హత్య) సహా ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నిందితుడు ఎంపీని బెదిరించడమే కాకుండా, ఆయన కుటుంబసభ్యులను, మత విశ్వాసాలను కించపరిచేలా తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై రవి కిషన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, “నా తల్లిని అసభ్య పదజాలంతో దూషించారు. మన ఆరాధ్య దైవం శ్రీరాముడి గురించి కూడా అవమానకరంగా మాట్లాడారు. ఇది కేవలం నాపై జరిగిన దాడి కాదు, మన ధర్మం, సంస్కృతిపై జరిగిన దాడి. అయినా నేను భయపడను. జాతీయవాదం, ధర్మం వైపే నిలబడతాను” అని ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి, నిందితుడిని గుర్తించారు. నిందితుడు బీహార్‌లోని అరా జిల్లాకు చెందిన అజయ్ కుమార్‌గా గుర్తించినట్లు సమాచారం. నిందితుడి ఫోన్ నంబర్‌ను ట్రేస్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ బెదిరింపుల నేపథ్యంలో ఎంపీకి భద్రత పెంచాలని ఆయన సిబ్బంది కోరారు. తెలుగులో పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు సుపరిచితుడైన రవి కిషన్, “న్యాయం జరుగుతుంది, ధర్మం గెలుస్తుంది” అని ధీమా వ్యక్తం చేశారు.