రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తిని రేపుతున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఏకపక్ష విజయం సాధించబోతోందని కేకే సర్వేస్ (KK Survey) అధినేత కేకే సంచలన ఫలితాలు ప్రకటించారు. ఈ సర్వే ప్రకారం, బీఆర్ఎస్కు ఏకంగా 55 శాతం ఓట్లు వస్తాయని, కాంగ్రెస్ పార్టీకి కేవలం 37 శాతం ఓట్లు మాత్రమే దక్కుతాయని ఆయన తేల్చి చెప్పారు. ఇంత భారీ తేడాతో బీఆర్ఎస్ విజయాన్ని అంచనా వేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
ఈ సర్వే నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో క్షేత్ర స్థాయిలో నిర్వహించినట్లు కేకే తెలిపారు. గతంలో కేకే సర్వే ఫలితాలు కొన్నిసార్లు విఫలమైన నేపథ్యంలో, జూబ్లీహిల్స్ వంటి అత్యంత పోటీ ఉన్న నియోజకవర్గంలో ఇంత పెద్ద తేడాతో బీఆర్ఎస్ విజయాన్ని ప్రకటించడం ద్వారా కేకే సర్వేస్ కొంత రిస్క్ తీసుకున్నట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఫలితాలు కనుక తుది ఫలితాలలో తేడా వస్తే, కేకే సర్వేస్‌కు ఉన్న విశ్వసనీయత దెబ్బతినే ప్రమాదం ఉంది.
బీజేపీ- మైనారిటీ ఓట్ల పంపిణీకి సంబంధించి కేకే సర్వే ఆసక్తికర అంశాలను వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం బీజేపీ పార్టీకి గతంలో వచ్చిన ఓట్లలో సగం మాత్రమే వస్తాయని అంచనా వేశారు. మరో ముఖ్య విషయం ఏమిటంటే, మజ్లిస్ (ఎంఐఎం) కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించినప్పటికీ, ముస్లిం ఓటర్లు ఆ సపోర్టును పట్టించుకోకుండా కాంగ్రెస్‌కు కాకుండా బీఆర్ఎస్ పార్టీకే సగానికి పైగా ఓట్లు వేస్తున్నారని సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ అభ్యర్థి బలం, మజ్లిస్ మద్దతు వంటి అనేక అడ్వాంటేజ్‌లు ఉన్నప్పటికీ, కేకే సర్వేలో బీఆర్ఎస్ విజయం ఏకపక్షంగా ఉండబోతుందని తేలడం గమనార్హం.