ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైన తర్వాత, టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తమ పరాజయానికి ప్రధాన కారణం జోష్ హేజిల్‌వుడ్ అద్భుతమైన బౌలింగే అని పేర్కొన్నాడు. మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ మాట్లాడుతూ, “జోష్ హేజిల్‌వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ముఖ్యంగా పవర్ ప్లేలోనే నాలుగు వికెట్లు తీసి మమ్మల్ని కోలుకోలేని దెబ్బతీసాడు. అతడు అభిషేక్ శర్మకు కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు” అని ప్రశంసించాడు. అయితే, అభిషేక్ శర్మ (68 పరుగులు) చాలా రోజులుగా తన జోరును కొనసాగిస్తున్నాడని, తన ఆట ఏంటో అతనికి తెలుసని, భవిష్యత్తులోనూ ఇలాంటి ఇన్నింగ్స్‌లు మరెన్నో ఆడతాడని ఆశిస్తున్నట్లు సూర్యకుమార్ తెలిపారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్, కేవలం 18.4 ఓవర్లలో 125 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీతో రాణించగా, హర్షిత్ రాణా (35) అతనికి అండగా నిలిచాడు. అయితే, శుభ్‌మన్ గిల్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మతో సహా మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమవ్వడం, అందులో ముగ్గురు బ్యాటర్లు ఖాతా కూడా తెరవకపోవడం జట్టు ఓటమికి కారణమైంది. ఆసీస్ బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్ (3/13) మూడు వికెట్లు తీయగా, గ్జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్ చెరో రెండేసి వికెట్లు తీశారు.
స్వల్ప లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 13.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ (46) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకోగా, ట్రావిస్ హెడ్ (28) దూకుడుగా ఆడాడు. భారత బౌలర్లు జస్‌ప్రీత్ బుమ్రా (2/26), వరుణ్ చక్రవర్తి (2/23), కుల్దీప్ యాదవ్ (2/43) రెండేసి వికెట్లు తీసినప్పటికీ, లక్ష్యం చిన్నది కావడంతో విజయం సాధించలేకపోయారు. “పవర్ ప్లేలో కాస్త కట్టడిగా బౌలింగ్ చేసినా, బ్యాటింగ్‌లో మరో 20 పరుగులు చేసినా ఫలితం మరోలా ఉండేది” అని సూర్యకుమార్ యాదవ్ అభిప్రాయపడ్డారు.