తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సినిమా పరిశ్రమ కార్మికుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, టికెట్ రేట్ల పెంపుపై సంచలన ప్రకటన చేశారు. తెలుగు సినిమా పరిశ్రమ ఉద్యోగుల ఫెడరేషన్ మరియు 24 ఇతర యూనియన్ ప్రతినిధులు ఏర్పాటు చేసిన అభినందన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “టికెట్ రేట్లు పెంచాలంటే, పెరిగిన మొత్తంలో 20 శాతం సినీ కార్మికులకు ఇవ్వాలి. లేకపోతే ఇకపై జీవో ఇవ్వమని!” అని స్పష్టం చేశారు. టికెట్ రేట్లు పెరిగితే నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు మాత్రమే డబ్బులు వస్తాయని, కానీ పరిశ్రమలో శ్రమిస్తున్న లైట్ మెన్, కెమెరా టెక్నీషియన్లు, స్పాట్ బాయ్స్ వంటి కార్మికులకు ఏమీ రాదని ఆయన పేర్కొన్నారు. అందుకే, పెరిగిన రేట్‌లో 20 శాతం మొత్తం తప్పకుండా కార్మికుల సంక్షేమ నిధికి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం తరపున ₹10 కోట్లు సినీ కార్మికుల వెల్ఫేర్ ఫండ్‌లో డిపాజిట్ చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ డబ్బును కార్మికులు ఎప్పుడు అవసరమైనా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. దీంతో పాటు, కృష్ణనగర్‌లోని సినీ కార్మికుల పిల్లల కోసం ప్రత్యేక స్కూల్ నిర్మిస్తామని, ఇది ఆధునిక సౌకర్యాలతో పాటు ఉచిత విద్యను అందిస్తుందని హామీ ఇచ్చారు. ఆరోగ్య కార్డులు, స్కిల్ ట్రైనింగ్ సెంటర్లు, పెన్షన్ స్కీమ్ వంటి సమస్యలన్నింటినీ పరిష్కరించి, వాటిని కార్మికులకు అందుబాటులోకి తెస్తామని ఆయన హామీ ఇచ్చారు.
సినిమా పరిశ్రమలో ఎవరైనా వ్యక్తులు లేదా వ్యవస్థలు నియంత్రణ తీసుకోవాలనుకుంటే, ప్రభుత్వం ఊరుకోదని సీఎం హెచ్చరించారు. హాలీవుడ్‌ను ఇక్కడికి తీసుకువచ్చే బాధ్యత తనదేనని చెబుతూ, హైదరాబాద్‌ను **’హాలీవుడ్’**గా మార్చాలంటే ముందుగా కార్మికుల సంక్షేమం బలోపేతం కావాలన్నారు. చిన్న సినిమాలను తక్కువ చేసి చూసే ప్రసక్తే లేదని, అలాగే ప్రజాయుద్ధ నౌక గద్దర్ పేరు మీద ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్’ను ప్రకటించి చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తున్నామని ఆయన గుర్తుచేశారు. ఆస్కార్ స్థాయికి తెలుగు పరిశ్రమ ఎదిగింది అంటే దానికి కారణం కార్మికులేనని రేవంత్ రెడ్డి కొనియాడారు.