హైదరాబాద్ పోలీస్ శాఖకు చెడ్డపేరు తెచ్చే విధంగా సంచలనాత్మక సంఘటన జరిగింది. దాదాపు రూ.3000 కోట్ల విలువైన ఆర్థిక నేరానికి పాల్పడ్డ నిందితుడిని వదిలిపెట్టేందుకు హైదరాబాద్‌కు చెందిన ఓ ఎస్ఐ (సబ్-ఇన్‌స్పెక్టర్) ఏకంగా రూ.2 కోట్ల డీల్ కుదుర్చుకున్నట్లు సోషల్ మీడియాలో, డిపార్ట్‌మెంట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పెట్టుబడుల పేరుతో వేల కోట్లు కొల్లగొట్టి ముంబయిలో తలదాచుకున్న నిందితుడిని పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ముంబయిలో నిందితుడిని అరెస్టు చేసిన ఎస్ఐ టీమ్ అతడిని హైదరాబాద్‌కు తరలిస్తుండగా ఈ డీల్ జరిగినట్లు సమాచారం.
నిందితుడిని వాహనంలో వేరే పోలీసుల నుంచి విడదీసి, ఎస్ఐ రూ.2 కోట్ల డీల్ కుదుర్చుకున్నాడని తెలుస్తోంది. డీల్‌లో భాగంగా రూ.2 కోట్లు తీసుకున్న తరువాత, మార్గమధ్యలో ఓ హోటల్ వద్ద డీల్ ప్రకారం నిందితుడిని ఎస్ఐ వదిలిపెట్టాడని ప్రచారం జరుగుతోంది. అనంతరం, నిందితుడు తప్పించుకున్నాడని ఉన్నతాధికారులకు ఎస్ఐ కట్టుకథ చెప్పాడని సమాచారం. ఇంతమంది పోలీసులు వెంట వెళ్లినా నిందితుడు ఎలా తప్పించుకున్నాడని ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.
ఈ విషయంపై పోలీస్ శాఖ అంతర్గత విచారణ (డిపార్ట్‌మెంట్ ఎంక్వైరీ) జరపగా, ఎస్ఐ భారీగా నగదు తీసుకుని నిందితుడిని వదిలేశాడని తేలినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ ఎస్ఐ 2020 బ్యాచ్‌కు చెందినవాడని, గతంలో కూడా అతడిపై ఇలాంటి ఆరోపణలు వచ్చినట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. ఈ ఘటనకు సంబంధించి నిందితుడు ఎవరు, లంచం తీసుకున్న ఎస్ఐ ఎవరు అనే విషయాలపై పోలీస్ శాఖ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.