టాలీవుడ్ కల్ట్ క్లాసిక్ చిత్రం ‘శివ’ మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్‌లో తెలుగు సినిమా చరిత్రను మలుపు తిప్పిన ఈ చిత్రం నవంబర్ 14న గ్రాండ్‌గా రీ-రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో, సినిమా ప్రముఖులు ‘శివ’తో తమ అనుబంధాన్ని పంచుకుంటున్నారు. ఇప్పటికే దర్శకులు శేఖర్ కమ్ముల, అశుతోష్ గోవారికర్ వీడియోలు విడుదల చేయగా, తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ జాబితాలో చేరారు.
‘శివ’ రీ-రిలీజ్‌పై అల్లు అర్జున్ ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. “తెలుగు సినిమా చరిత్రలో ‘శివ’ ఒక ఐకానిక్ చిత్రం. ఈ ఒక్క సినిమాతో భారతీయ చిత్ర పరిశ్రమలో ఎన్నో మార్పులు వచ్చాయి” అని కొనియాడారు. అలాంటి సినిమా మళ్లీ థియేటర్లలోకి వస్తుంటే, ఆ సంబరాన్ని గ్రాండ్‌గా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
అక్కినేని అభిమానులకు మరియు తెలుగు సినీ ప్రియులకు అల్లు అర్జున్ తనదైన శైలిలో విజ్ఞప్తి చేశారు. “ఈసారి థియేటర్‌కు వెళ్లేటప్పుడు రెండు లారీల పేపర్లు తీసుకెళ్లండి” అంటూ అభిమానులు తమ ఆనందాన్ని పంచుకోవాలని కోరారు. రీ-రిలీజ్ అవుతున్న ఈ కల్ట్ క్లాసిక్ కోసం అభిమానులు భారీ స్థాయిలో ఎదురుచూస్తున్నారు.