కర్నూలు విషాదం మరువక ముందే: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సు ప్రమాదం

కర్నూలులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదం ఘటన మరువక ముందే, హైదరాబాద్‌లో మరో ఘోర ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి మియాపూర్ నుంచి గుంటూరు వెళుతున్న న్యూగో ఎలక్ట్రిక్ బస్సు, హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్ పేట్ వద్ద ఔటర్ రింగ్ రోడ్ (ORR) నుంచి కిందకు బోల్తా పడింది. బస్సులో 20 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడగా, వారిని వెంటనే అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

కర్నూలు ప్రమాదంపై దర్యాప్తు పురోగతి

శుక్రవారం ఉదయం కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 20 మంది సజీవ దహనమైన సంగతి తెలిసిందే. బైక్ ఢీకొన్న తర్వాత మంటలు చెలరేగగా, బస్సు లగేజీ క్యాబిన్‌లో ఉన్న 400కు పైగా సెల్ ఫోన్ల బ్యాటరీలు ఒక్కసారిగా పేలడం వల్ల ప్రమాద తీవ్రత మరింత పెరిగిందని ఫోరెన్సిక్ బృందం అంచనా వేసింది. అలాగే, ఈ ప్రమాదానికి కారణమైన బైక్ రైడర్ శివశంకర్, ప్రమాదం జరిగిన సమయానికి మద్యం మత్తులో ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా సమాచారం.

నిబంధనల ఉల్లంఘనపై రవాణా శాఖ కొరడా

ఘోర ప్రమాదాల నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్‌పై రవాణా శాఖ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్, కూకట్‌పల్లి, గగన్ పహాడ్ వంటి ప్రాంతాల్లో భారీ స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న నాలుగు బస్సులను సీజ్ చేశారు. స్లీపర్ బస్సుల్లో భద్రత ప్రమాణాలు తక్కువగా ఉండటం, ఇరుకుగా ఉండటం వల్ల అత్యవసర సమయంలో బయటకు వెళ్లడం కష్టమై ప్రాణ నష్టం పెరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చైనాలో 2012లోనే స్లీపర్ బస్సులను నిషేధించినందున, మనదేశంలో కూడా నిషేధించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రమాదం జరిగినప్పుడే కాకుండా, అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *