కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు బైక్‌ను ఢీకొనడంతో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. బైక్ ఇంధన ట్యాంక్ మంటలు పట్టి, కొద్ది సెకన్లలోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. ఈ భయానక ఘటనలో బైక్ రైడర్‌తో పాటు బస్సులోని 20 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. కొందరిని స్థానికులు, రెస్క్యూ బృందాలు సకాలంలో బయటకు తీసి ఆస్పత్రికి తరలించగలిగారు.
ఈ ఘోర ప్రమాదం జరిగిన ప్రాంతంలో రక్షణ చర్యలు కొనసాగుతున్న సమయంలో మరో దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. మంటల్లో కాలిపోయిన బస్సును క్రేన్ సాయంతో పక్కకు తొలగించే ప్రయత్నం చేస్తుండగా, ఆ క్రేన్ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో క్రేన్ ఆపరేటర్ తీవ్రంగా గాయపడటంతో, అతన్ని చికిత్స నిమిత్తం వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ విషాద ఘటనపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వం స్పందించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించాయి. అదేవిధంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా సంతాపం తెలుపుతూ, మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ ప్రమాదానికి సంబంధించి దర్యాప్తులో మొబైల్ ఫోన్ల పేలుళ్లే మంటలు తీవ్రమవడానికి కారణమని ప్రాథమికంగా గుర్తించారు.