బిగ్‌బాస్ ఫేమ్ దివ్య సురేశ్‌పై హిట్ అండ్ రన్ కేసు: బైక్‌ను ఢీకొట్టి పరారీ

కన్నడ నటి మరియు బిగ్‌బాస్ కన్నడ సీజన్-8 కంటెస్టెంట్ అయిన దివ్య సురేశ్‌పై బెంగళూరు పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేశారు. ఈ నెల 4వ తేదీ అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో బెంగళూరులోని బ్యాటరాయనపుర ఎంఎం రోడ్డులో ఆమె ప్రయాణిస్తున్న కారు ఒక బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే దివ్య సురేశ్ కారు ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు బాధితులు ఆరోపించారు.

ఈ ప్రమాదంలో కిరణ్ అనే యువకుడు తన స్నేహితులైన అనుషా, అనితలతో కలిసి బైక్‌పై వెళ్తుండగా, దివ్య కారు వారిని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత కారణంగా బైక్‌పై ఉన్న ముగ్గురూ కిందపడిపోయారు. వారిలో అనిత అనే యువతి మోకాలికి ఫ్రాక్చర్ కాగా, కిరణ్, అనుషాలకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై బాధిత యువకుడు కిరణ్ ఈ నెల 7న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

బాధితుల ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు, ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. కారు నంబర్ ఆధారంగా అది నటి దివ్య సురేశ్‌కు చెందినదిగా గుర్తించి, ఆమెను విచారణకు పిలిచారు. అనంతరం ఆమె ప్రయాణించిన కారును సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *