భారతదేశ సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి (CJI) నియామక ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి వచ్చే నెల నవంబర్ 23న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, ఆయన వారసుడి పేరును సిఫార్సు చేయాల్సిందిగా కోరుతూ కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రస్తుత సీజేఐకి లేఖ పంపనున్నారు. సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సూర్యకాంత్ (Justice Surya Kant) తదుపరి సీజేఐగా నియమితులయ్యే క్యూలో మొదటి స్థానంలో ఉన్నారు.
జస్టిస్ సూర్యకాంత్ 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన 2027 ఫిబ్రవరి 9 వరకు దాదాపు 15 నెలల పాటు ప్రధాన న్యాయమూర్తిగా పదవిలో కొనసాగనున్నారు. హర్యానాలోని హిస్సార్ జిల్లాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తిగా రెండు దశాబ్దాలకు పైగా అనుభవాన్ని సుప్రీంకోర్టుకు తీసుకువచ్చారు.
జస్టిస్ సూర్యకాంత్, ఆర్టికల్-370, భావప్రకటనా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, అవినీతి, పర్యావరణం, లింగ సమానత్వానికి సంబంధించిన చారిత్రక తీర్పులు ఇచ్చిన బెంచ్‌లలో భాగమయ్యారు. ముఖ్యంగా, వలస పాలన కాలం నాటి రాజద్రోహం చట్టాన్ని నిలిపివేస్తూ ఆదేశించిన బెంచ్‌లోనూ, రక్షణ దళాలకు సంబంధించిన వన్ ర్యాంక్-వన్ పెన్షన్ (OROP) పథకాన్ని రాజ్యాంగబద్ధంగా సమర్థించిన బెంచ్‌లోనూ ఆయన సభ్యులుగా ఉన్నారు. ఎన్నికలలో పారదర్శకతను నిర్ధారించడానికి బీహార్ ఓటర్ల జాబితా వివరాలను బహిరంగపరచాలని ఎన్నికల కమిషన్‌ను కోరడం వంటి ముఖ్యమైన నిర్ణయాలలోనూ ఆయన పాత్ర ఉంది.