కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కే పరిమితమైన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తాజాగా నిర్వహించిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సమీక్షా సమావేశంలో పూర్తి ఆరోగ్యంగా, ఫుల్ జోష్‌తో కనిపించడం పార్టీ నాయకుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని తెలుస్తోంది. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఆయన ప్రతి ఒక్క నేతతో నవ్వుతూ మాట్లాడటం, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం, అన్ని అంశాలను నిశితంగా గమనిస్తున్నట్లు మాట్లాడటం నేతల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందట.
కేసీఆర్ మాటలు బీఆర్‌ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్తేజం నింపాయి. ముఖ్యంగా, కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు విసిగిపోయారని, ఇచ్చిన ఒక్క హామీని కూడా సరిగ్గా నెరవేర్చలేదని, ప్రజల్లో కాంగ్రెస్ సర్కార్‌పై నమ్మకం పోయిందని ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇదే సమయంలో, వచ్చే రెండున్నరేళ్లలో మళ్లీ బీఆర్‌ఎస్ అధికారం చేపట్టడం ఖాయమని కేసీఆర్ నమ్మకంగా చెప్పడం పార్టీ నేతలకు బూస్టప్ ఇచ్చినట్లైంది.
ఫామ్‌హౌస్ సమావేశంలో కేసీఆర్ చూపిన చురుకుదనం, ఆయన మాట తీరును గమనించిన పార్టీ లీడర్లు.. సార్ ఇకపై మళ్లీ ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టబోతున్నారని భావిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా కేసీఆర్ ఒక సభలో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాకుండా, ఇకపై తెలంగాణ భవన్‌కు రెగ్యులర్‌గా రానున్నట్లు, వరుస సమావేశాలతో బిజీబిజీగా గడపనున్నారని సమాచారం. అవసరాన్ని బట్టి జిల్లాల పర్యటనలకు కూడా ప్లాన్ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామం బీఆర్‌ఎస్‌లో మునుపటి జోష్ తీసుకువస్తుందని నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.