యూఏఈ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దుబాయ్‌లోని లీ మెరిడియన్ హోటల్‌లో ఏర్పాటు చేసిన ‘తెలుగు డయాస్పోరా’ సదస్సులో గల్ఫ్ దేశాల ప్రవాసాంధ్రులతో ఆత్మీయంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రపంచంలో తెలుగు జాతికి తిరుగే లేదు. ప్రపంచంలో తెలుగు జాతిని నెంబర్ వన్ గా నిలబెట్టడమే నా లక్ష్యం” అని ధీమా వ్యక్తం చేశారు. 30 ఏళ్ల క్రితం తాను ఐటీకి పునాదులు వేయడం వల్లే నేడు తెలుగువారు సత్య నాదెళ్ల వంటి దిగ్గజాలుగా ప్రపంచవ్యాప్తంగా రాణిస్తున్నారని గుర్తుచేశారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తన వద్ద స్పష్టమైన ప్రణాళిక ఉందని చంద్రబాబు వివరించారు. “గతంలో హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్‌ను తీసుకొచ్చాను. ఇప్పుడు అదే స్ఫూర్తితో విశాఖపట్నానికి గూగుల్ తీసుకువస్తున్నాం” అని ప్రకటించారు. సుమారు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ సంస్థ విశాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయబోతోందని తెలిపారు. దేశంలోనే ‘క్వాంటం వ్యాలీ’ ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని గర్వంగా చెప్పారు.
“ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే లక్ష్యంతో” ముందుకు వెళ్తున్నామని సీఎం ఉద్ఘాటించారు. పాలనలో సాంకేతికతను జోడిస్తూ వాట్సప్ ద్వారా 730కి పైగా పౌర సేవలను అందిస్తున్నామని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని తెలిపారు. అబుదాబీ, దుబాయ్ నగరాల స్ఫూర్తితో ఏపీలో కూడా అదే తరహా అభివృద్ధిని సాధిస్తామని, రాష్ట్రంలో పర్యాటక రంగం, నాలెడ్జ్ ఎకానమీకి ప్రాధాన్యత ఇస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.